తెలంగాణలో ఉచితంగా వ్యాక్సిన్‌..?

by Shyam |   ( Updated:2021-04-21 10:39:40.0  )
తెలంగాణలో ఉచితంగా వ్యాక్సిన్‌..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ను అందరికీ ఉచితంగా ఇవ్వడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. వ్యాక్సిన్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వస్తే ఉచితంగానే ఇస్తామని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ గతంలోనే ప్రకటించారు. ఆ దిశగానే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మే నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్ళ పైబడినవారంతా వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎంత మంది లబ్ధిదారులు ఉంటారో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లెక్కలు సేకరిస్తోంది. ఇప్పటికే 45 ఏళ్ళ పైబడినవారు, వృద్ధులు, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు.. ఇలా అందరికీ ఉచితంగా ఇస్తున్నందున వారిని మినహాయించి 18-44 ఏళ్ళలోపు వయసున్నవారి వివరాలు జిల్లాలవారీగా సిద్ధమవుతున్నాయి.

రాష్ట్రంలో 18-44 ఏళ్ళ ఏజ్ గ్రూపు వారంతా వ్యాక్సిన్‌కు అర్హులే కావడంతో లబ్ధిదారులు సుమారు 2.62 కోట్ల మంది ఉంటున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసును రూ. 400 చొప్పున విక్రయించనున్నట్లు ‘కొవిషీల్డ్‘ వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్న సీరం సంస్థ ప్రకటించింది. టీకాలను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్ర ఖజానాకు సుమారు రూ. 2,100 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వంపై ఆధారపడకుండా సంపన్న వర్గాలు స్వంత ఖర్చుతో వేయించుకునేటట్లయితే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇవ్వడంపై అధికారికంగా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ఇప్పటికే లక్షలాది మందికి రకరకాల సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నందున వ్యాక్సిన్ కోసం రూ. 2,100 కోట్లను ఖర్చు పెట్టడం పెద్ద కష్టమేమీ కాదని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. అయితే ఉచితంగా ఇవ్వడానికి ఎలాంటి అర్హతలను ప్రామాణికంగా తీసుకోవాలన్నదానిపై ఆలోచనలు జరుగుతున్నాయి. తెల్ల రేషను కార్డుల్ని పరిగణనలోకి తీసుకోవాలా లేక ఆసరా పింఛను అందుకుంటున్న పేదరికాన్ని లెక్కలోకి తీసుకోవాలా అనేదానిపై చర్చలు మొదలయ్యాయి. పేదలకు టీకాల ద్వారా అదనపు భారం పడొద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి పేదరికంలో ఉన్నవారికి పూర్తిగా ఉచితంగా ఇవ్వడానికే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశం ఉంది. సబ్సిడీ ధరకు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నప్పటికీ సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం భరించలేనంతటి దీన స్థితిలో లేదన్నది పార్టీ సీనియర్ నేత అభిప్రాయం.

రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసును రూ. 400 చొప్పున విక్రయించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. ఆ ప్రకారం ప్రతీ ఒక్కరికి (రెండు డోసులకు) రూ. 800 చొప్పున ఖర్చు కానుంది. రాష్ట్రంలో 18-44 ఏజ్ గ్రూపులో ఉన్న 2.62 కోట్ల మందికి ఉచితంగా టీకాలను ఇవ్వడం ద్వారా ఆర్థికంగా పడే భారం కంటే రాజకీయంగా లభించే మైలేజీ చాలా ఎక్కువగా ఉంటుందన్నది ఆ నేత అభిప్రాయం. ఈ నెల 30న వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు సహా మరో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ‘ఉచితం‘ అనే నిర్ణయం తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇవ్వలేకపోయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రజల ఆరోగ్యం కోసం ఆర్థికంగా భారమైనా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందంటూ బీజేపీని ఇరుకున పెట్టడానికి ఒక అస్త్రంగా వాడుకోవడానికి ఆస్కారం ఉంది.

దేశం మొత్తం మీద సుమారు 13 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇప్పటికే అందగా అందులో తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో తీసుకున్నవారు సుమారు 33 లక్షల మంది ఉన్నారు. మే నెల 1వ తేదీ నుంచి 18-44 ఏళ్ళ వయసువారికి కూడా వ్యాక్సిన్ తీసుకోడానికి అవకాశం లభిస్తున్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పటికల్లా మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. రైతుబంధు, రైతుబీమా, వంద యూనిట్లలోపు వారికి ఉచిత విద్యుత్, లాండ్రీ-సెలూన్‌లకు ఉచితం లాంటి పథకాలు అమలవుతున్నాయి. తాజాగా ‘ఉచిత వ్యాక్సిన్‘ అనేది కూడా ఆ జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలమని, ప్రైవేటు ఆసుపత్రులు, ఓపెన్ మార్కెట్‌లో విక్రయాలు చేయాలంటే ఉత్పత్తి సామర్థ్యం పెరగాల్సి ఉంటుందని, ఇందుకు నాలుగైదు నెలల సమయం పడుతుందని సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ఒక ప్రకటనలో తెలిపారు. అప్పటివరకూ కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుంది.

Advertisement

Next Story