‘ఆస్క్ కేటీఆర్’లో మంత్రి చెప్పింది ఇదే..

by Shyam |   ( Updated:2021-05-13 11:00:36.0  )
Ask KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట నెటిజన్లతో ముచ్చటించారు. కొవిడ్ పై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కరోనా తీవ్రత, ట్రీట్ మెంట్, మెడిసిన్ వినియోగంపై ఉన్న సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ సంభాషణ ట్విట్టర్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా నిలిచింది.

ట్విట్టర్‌లో మంత్రి ఏం సంభాషించారంటే..

ప్రస్తుతం తెలంగాణలో లాక్ డౌన్ సమర్థవంతంగా కొనసాగుతుందన్నారు. కొంతమంది సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా… ప్రజల సౌకర్యార్థం 4 గంటలపాటు వెసులుబాటు ఇస్తున్నామని, ఈ-కామర్స్‌తో ప్రజల అవసరాలు తీరేలా సౌకర్యం కల్పించామన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు లాక్డౌన్ తో కరోనా కొంత తగ్గుముఖం పడుతుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు .

‘రెమిడిసివిర్’ వినియోగంపై ఆడిట్, పర్యవేక్షణ

ఆక్సిజన్ సరఫరా కేంద్రం ఆధీనంలో ఉందని, ఆక్సిజన్ సప్లై విషయంలో దేశం సవాళ్లను ఎదుర్కొంటున్నదని మంత్రి తెలిపారు. మరోవైపు రెమిడిసివిర్ మందుల వినియోగంలో ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తుందని వివరించారు. కొవిడ్ రోగులకు కుటుంబాల నుంచి ఈ మందు వినియోగానికి తమ పైన తీవ్రమైన ఒత్తిడి ఉందని వైద్యులు తెలిపిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ప్రైవేట్ ఆసుపత్రులు కొవిడ్ రోగులను దోచుకుంటున్నాయని, చికిత్స, ఖర్చు విషయంలో జాతీయ స్థాయిలో ఏకీకృత విధానం రూపొందించాలని చేసిన సూచనకు స్పందించిన కేటీఆర్, ఈ అంశం పైన దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

28వేల బృందాలతో ఇంటింటి సర్వే

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ఫివర్ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 28 వేల బృందాలు 60 లక్షల ఇళ్లను సందర్శించించాయని, ఈ ప్రయత్నంతో త్వరలో సానుకూల ఫలితాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రులంతా జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కలెక్టర్, డీఎంహెచ్ఓ స్థానిక ఆసుపత్రుల అధికారులతో ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారని గుర్తు చేశారు. వీటిల్లో ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు అవుతారన్నారని తెలిపారు. కరోనా సోకితే మానసిక, శారీరక ఆరోగ్యంపైన అత్యంత ప్రభావం చూపుతుందన్నారు. సొంత వైద్యం పనికిరాదని.. కేవలం వైద్య నిపుణులు సూచించిన ప్రామాణిక పద్ధతుల్లోనే వైద్యం తీసుకోవాలని కోరారు. మానసికంగా బలంగా ఉండాలని, కొవిడ్ రికవరీ తర్వాత ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేసే సోషల్ మీడియా, టీవీ చానెల్స్‌కు దూరంగా ఉండాలని కోరారు. వాట్సాప్ నిపుణుల సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోద్దని, వీలుంటే వ్యాయామం చేయాలన్నారు.

వ్యాక్సినేషన్‌లో తెలంగాణ ముందంజ…

కో వ్యాక్సిన్ ఫార్ములాను భారత్ బయోటెక్ ఇతర కంపెనీలతో పంచుకొని వ్యాక్సిన్ అందరికీ అందేలా చూడటంలో కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ఇప్పటికే వ్యాక్సినేషన్‌లో జాతీయ సగటు కన్నా తెలంగాణ ముందువరసలో ఉందని, ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు సైతం తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యాక్సిన్ సరఫరానే అతి పెద్ద అడ్డంకిగా మారిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు 9 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసే యంత్రాంగం ఉందని, అయితే వ్యాక్సిన్ సరఫరా అతి పెద్ద సవాల్‌గా మారిందన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ల తో మాట్లాడుతున్నామన్నారు. రానున్న జూలై దాకా డౌటేనని, ఆగస్టు మొదటి వారం నాటికి వ్యాక్సిన్లు సరఫరా తగినంత ఉండే అవకాశం ఉందని, అప్పటివరకు వాక్సినేషన్ కార్యక్రమం కొంత సవాల్‌తో కూడుకుందన్నారు.

తెలంగాణలో వ్యాక్సినేషన్ ఓ సవాలే…

నాలుగున్నర కోట్లకు పైగా జనాభా ఉన్న తెలంగాణకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం సవాలే అన్నారు. త్వరలోనే ఫైజర్, మోడర్నా కంపెనీల వ్యాక్సిన్ లకు సైతం అనుమతి లభిస్తుందన్నారు. ఆగస్టు మాసాంతానికి దేశీయంగా బయోలాజికల్-ఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మాసిటీ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుగా మారబోతుందన్నారు

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం హెల్ప్ డెస్క్

హైదరాబాద్ కేవలం తెలంగాణ వారికి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి వస్తున్న రోగులకు సైతం చికిత్స అందిస్తుందని, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ నియంత్రణ కోసం పనిచేస్తున్న పౌరులు, స్వచ్ఛంద సంస్థల సేవలను కేటీఆర్ కొనియాడారు. ప్రపంచం ఎప్పుడూ ఎదుర్కొని ఈ పరిస్థితుల్లో ఉన్నామని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో కనీసం ఆన్లైన్ ద్వారానైనా చదువుకునే, కోచింగ్ తీసుకునే విద్యార్థులు పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎవరికైన కొవిడ్‌ వస్తే మల్టీ విటమిన్లు, ఇతర ప్రాథమిక మందులను తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story