ఆ దేశాల్లో వచ్చే నెల నుంచి వ్యాక్సినేషన్?

by vinod kumar |
ఆ దేశాల్లో వచ్చే నెల నుంచి వ్యాక్సినేషన్?
X

న్యూఢిల్లీ: కరోనా టీకా ప్రయోగాల్లో సత్ఫలితాలు వెలువడుతున్న తరుణంలో వ్యాక్సిన్ కొనుగోలు, పంపిణీ, నిర్వహణలపై దేశాలు కసరత్తు చేస్తున్నాయి. వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కొన్ని దేశాలు మరో అడుగు ముందుకేసి అత్యవసర వినియోగానికి ఆమోదించడానికి సిద్ధమవుతున్నాయి. తుది దశ ప్రయోగాల ఫలితాలపై సమగ్ర అధ్యయనం వెలువడటానికి ముందే అత్యవసరంగా ఆమోదాన్నిచ్చి టీకా వేయించే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచే ప్రారంభించడానికి అమెరికా, యూకే, జర్మనీలు కసరత్తులు చేస్తున్నాయి. ఫైజర్ టీకా, మొడెర్నా, ఆస్ట్రా జెనెకా టీకాలు 90శాతానికి పైగా సమర్థతను కలిగి ఉన్నట్టు తొలిదశ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 10న టీకా అత్యవసర వినియోగానికి అనుమతిపై చర్చిస్తామని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అధికారులు వెల్లడించారు. కాగా, అమెరికా కంటే ముందుగానే తాము అనుమతినిచ్చి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని బ్రిటన్ రెగ్యులేటరీ అధికారవర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ డేటాపై వివరాలను ఇప్పటి నుంచే పరిశీలిస్తామని, వచ్చే నెల 1వ తేదీకి ముందే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సన్నాహాలుచేస్తున్నట్టు నేషనల్ హెల్త్ సర్వీస్ వివరించారు. డిసెంబర్‌ ద్వితీయార్థం నుంచి టీకా వేయించడానికి వ్యూహాన్ని తయారుచేసుకున్నట్టు జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ చెప్పారు.

Advertisement

Next Story