ఈటలకు మరో షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన సన్నిహితులు

by Sridhar Babu |
ఈటలకు మరో షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన సన్నిహితులు
X

దిశ, హుజురాబాద్ : ఉపఎన్నికలో టీఆర్ఎస్ జోష్ పెంచింది. నామినేషన్ల పర్వానికి తెరలేవడంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా టీఆర్ఎస్ వదులుకోవడం లేదు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను అష్ట దిగ్భందనం చేస్తూ.. ఆయన సొంత మండలం కమలాపూర్‌పై దృష్టి సారించింది. హరీష్ రావు సూచనలతో రంగంలోకి దిగిన టీఆర్ఎస్ శ్రేణులు కమలాపూర్ ఎంపీపీతో పాటు మాజీ జడ్పీటీసీ సభ్యుడు కుమారస్వామిని పార్టీలోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పారు. ప్రధానంగా ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలను బీజేపీ నుంచి సొంత గూటిలో చేర్చుకుంటూ ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం ఈటల సొంత మండలం కమలాపురం ఎంపీపీ తడక రాణి కూడా బీజేపీని వీడి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరగా శుక్రవారం కుమారస్వామి గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో ఈటలకు మరో షాక్ తగిలినట్లయింది. గతంలో రాజేందర్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న పింగళి రమేష్, దేశిని కోటి, రంజిత్‌లు బీజేపీకి రాజీనామా చేసి సొంత గూటికి చేరగ.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత కమలాపురం మండల నేతలు దూరం కావడం ఈటలకు ఊహించని పరిణామమే. అయితే ఇది తాము ఉహించిందేనని ప్రజలే న్యాయ నిర్ణేతలని ఈటల వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే హుజురాబాద్ ఉప ఎన్నికలు ముగిసే నాటికి జరిగే పరిణామాలు ఎలా ఉంటాయోననే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Advertisement

Next Story

Most Viewed