విసిగించొద్దని ఫోన్ పెట్టేసిన సోదరుడు.. తెల్లారేసరికి శవమై కనిపించిన రహీం

by Shyam |
cine worker suicide
X

దిశ, చార్మినార్: తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకొని సినీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట ఎస్ఐ గోవర్థన్ వివరాల ప్రకారం.. పాతబస్తీ గౌస్‌నగర్‌కు చెందిన సయ్యద్ రహీం(24) గుర్రపు స్వారీ చేయడంలో దిట్ట. అలాగే సినిమాల షూటింగ్‌లలో లేబర్​పనులు చేసేవాడు. ఇటీవల రహీం తాగుడుకు బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యం సేవించిన రహీం తన సోదరుడు గౌస్‌కు ఫోన్​చేసి ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పాడు.

బాగా తాగినట్టున్నావ్.. విసిగించకు, పడుకో, పడుకుంటే అంతా సెట్ అవుతుందని గౌస్ ఫోన్ పెట్టేశాడు. శనివారం ఉదయం షూటింగ్ కోసం ఫోన్ రాగా, నిద్రలేపడానికి తల్లి షాహేజా బేగం రహీం గదిలోకి వెళ్లింది. దీంతో రహీం చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. వెంటనే స్థానికులకు సమాచారం అందజేయగా, వారు పోలీసులకు తెలియజేశారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed