కరోనా ఎఫెక్ట్.. కొడుకును చంపిన ఫుట్‌బాల్ ప్లేయర్

by Sumithra |
కరోనా ఎఫెక్ట్.. కొడుకును చంపిన ఫుట్‌బాల్ ప్లేయర్
X

‘నేను అతడిని ప్రేమించడం లేదు.. అతడంటే నాకు ఇష్టం లేదు.. అందుకే చంపేశా’.. కరోనా వైరస్ లక్షణాలతో చికిత్స పొందుతున్న కన్న కొడుకును చంపేసి పోలీసులకు లొంగిపోయిన టర్కీ ఫుట్‌బాల్ ప్లేయర్ కెవెర్ టోక్టాస్ చెప్పిన మాటలు ఇవి. టర్కీలో స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉన్న టోక్టాస్, గత నెల 23న తన ఐదేండ్ల కొడుకు కాసింను బుర్సా ప్రావిన్స్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్న కాసింను కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని వైద్యులు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. తండ్రి టోక్టాస్‌ కూడా అదే వార్డులో క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ.. కొడుకు బెడ్ వద్దకు వెళ్లి నిద్రిస్తున్న అతని ముఖంపై దిండుతో పావుగంట సేపు అదిమి పట్టుకుని హత్య చేశారు. అనంతరం తన కుమారుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని వైద్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వైద్యులు చిన్నారిని ఐసీయూకి తరలించి చికిత్స ప్రారంభించారు. దాదాపు రెండు గంటలపాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడిన చిన్నారి చివరకు తుది శ్వాస విడిచాడు. కరోనా వల్లే కాసిం ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత టోక్టాస్ కొడుకు అంత్యక్రియలు కూడా నిర్వహించాడు. కన్న కొడుకును హత్య చేసిన పాపం తరచూ అతని మనసులో మెదలుతుండగా పశ్చాత్తాపంతో 11 రోజుల అనంతరం మే 4న పోలీసుల వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నారు. అతడంటే నాకు ఇష్టం లేదు అందుకే చంపానని చెప్పాడు. నాకు మానసిక రుగ్మతలు కూడా ఏవీ లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఫుట్‌బాల్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. టర్కీలోని టోక్టాస్ అభిమానులు తమ ప్రియతమ సాకర్ ఆటగాడు ఇలా చేశాడంటే నమ్మలేక పోయారు.

Advertisement

Next Story

Most Viewed