ట్రంప్ అట్లా.. డెమోక్రాట్లు ఇట్లా !

by vinod kumar |   ( Updated:2020-05-02 12:13:42.0  )
ట్రంప్ అట్లా.. డెమోక్రాట్లు ఇట్లా !
X

వాషింగ్టన్: కరోనా భయాందోళనలతో అమెరికాలో నెల రోజుల నుంచి సెనేట్ సమావేశం కాలేదు. కాగా, కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన అమెరికా ఆర్థిక రంగాన్ని ఆదుకోవడానికి తీసుకోబోయే చర్యలపై సోమవారం అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్)లోని ఎగువ సభ (సెనేట్)లో చర్చించాలని ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. అయితే ఈ సమావేశానికి హాజరుకావడంపై డెమోక్రటిక్ సెనేటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తాము ఈ సమావేశంలో పాల్గొనలేమంటున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్.. సెనేట్ సమావేశానికి వచ్చే వాళ్లు భయపడాల్సిన పని లేదని, అందరికీ పూర్తి వైద్య పరీక్షలు చేసిన తర్వాతే అనుమతిస్తామని చెబుతున్నారు. కేవలం 5 నిమిషాల్లో ముగిసే అబాట్ టెస్టులు నిర్వహిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.

అయితే కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఒకసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన ట్రంప్.. మరోసారి సెనేట్‌లో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని భావిస్తున్నారని, దీనికి సెనేట్ మద్దతు అవసరం కాబట్టే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, నవంబర్‌లో ఎన్నికలు ఉన్నందున ఉద్దీపన ప్యాకేజీ ద్వారా లబ్ది పొందాలనేది ట్రంప్ ఎత్తుగడగా పలు వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ట్రంప్ ఈ విషయంలో విజయం సాధిస్తారో లేదో సోమవారం తేలనుంది.

Tags: Senate, Congress, Coronavirus, Donald Trump, Relief Package, Financial Sector, Economy, White House

Advertisement

Next Story

Most Viewed