చిన్న పేపర్ ముక్క ఆఫీసులో పడేయండి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
TRS MLA Saidi Reddy
X

దిశ, హుజూర్‌నగర్: ప్రభుత్వ కార్యాలయంలో ఏ అధికారి సరిగా పనిచేయకపోయినా, డబ్బులు అడిగినా, చిన్న పేపర్ ముక్కమీద అతని పేరు రాసి తమ ఆఫీసులో పడేస్తే సదరు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం హుజూర్‌నగర్ తహసీల్దార్ వజ్రాల జయశ్రీ అధ్యక్షతన జరిగిన కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ అయినా.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని హితవు పలికారు. ఎన్నికలు లేకున్నా తరచూ అధికార పార్టీపై విమర్శలు చేస్తూ.. అభివృద్ధిని అడ్డుకోకూడదని అన్నారు. చేతనైతే అభివృద్ధి కోసం పోటీపడి డబ్బులు తీసుకురావాలని అన్నారు.

ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్‌నగర్‌కు వచ్చినప్పుడు రోడ్ల మరమ్మతుల కోసం హుజూర్‌నగర్‌కు రూ.25 కోట్లు, నేరేడుచర్లకు రూ.15 కోట్లు కేటాయించారని తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తై పనులు ప్రారంభమయ్యే సమయంలో కొందరు కోర్టుకు వెళ్లి పనులు ఆపేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక, తహసీల్దార్ ఆఫీసులో, పోలీస్ స్టేషన్‌లలో బ్రోకర్ల వ్యవస్థ నిర్మూలన జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర రావు, కౌన్సిలర్లు యరగాని గురవయ్య, గుంజ భవాని, జక్కుల శంభయ్య, కుంట ఉపేంద్ర, సైదులు, పిన్నేని సంపత్, బెల్లంకొండ అమర్ తదితరులు పాల్గొ్న్నారు.

Advertisement

Next Story