16 ఎకరాల భూమి మాయం.. రగిలిపోతున్న గిరిజనులు

by Sridhar Babu |   ( Updated:2021-07-09 10:57:39.0  )
Tribals protest
X

దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో 16 ఎకరాల పట్టాభూమి మాయమైంది. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల 28 నిరుపేద గిరిజన కుటుంబాలకు శాపమైంది. దీంతో చేసేందేంలేక న్యాయం చేయాలని పట్టాలు చేతపట్టుకొని రోడ్డుపైన మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. వివరాళ్లోకి వెళితే.. చర్ల మండల కేంద్రంలోని విజయకాలనీకి చెందిన నిరుపేద గిరిజనులు స్మశాన వాటిక పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో పిచ్చిమొక్కలు తొలగించి, చదును చేసుకున్నారు. 2007లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కలెక్టర్, ఐటీడీఏ పీవో, నాటి భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేతులమీదుగా 28 మంది గిరిజన కుటుంబాలకు 16 ఎకరాల భూమిని పంపిణీ చేసి పట్టాలు ఇచ్చారు. 53వ సర్వేనంబర్ పేరుతో ఇచ్చిన ఆ పట్టాలను గిరిజన రైతులు బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకున్నారు. ఆ భూమికి రైతుబంధు సైతం వస్తోంది.

సమిష్టిగా ఆ భూమిని బాగుచేసుకుంటుండగా.. అకస్మాత్తుగా అధికారులు వచ్చి అడ్డుపడ్డారు. ఆ భూమి ఏకలవ్య పాఠశాలకు కేటాయించామని పిడుగులాంటి వార్త చెప్పడంతో గిరిజనులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పట్టాలు చేతపట్టుకొని చర్ల రెవెన్యూ అధికారుల చెంతకు పరుగులు తీశారు. అక్కడ వారికి మరో షాక్ తగిలింది. గిరిజనులు సుమారు 15 ఏళ్ళుగా తమ ఆధీనంలో ఉంచుకొని బాగు చేస్తున్న భూమి గిరిజనులకు ఇచ్చింది కాదని.. రికార్డు ఆధారంగా 1వ సర్వే నెంబర్ ప్రకారం.. ఏకలవ్య పాఠశాలకు కేటాయించినట్లుగా ఉందని రెవెన్యూ అధికారులు గిరిజనులకు వివరించారు.

గిరిజనులకు పట్టాలు ఇచ్చిన 53వ సర్వే నెంబర్ భూమి అసలు రికార్డుల్లో లేదని చెప్పడం గమనార్హం. ఆ ప్రాంతంలో 49వ సర్వే నెంబర్ వరకే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు తమని మోసం చేశారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ళు మేము భూమిని బాగుచేస్తుంటే అధికారులు ఎందుకు అడ్డుపడలేదని ప్రశ్నిస్తున్నారు. తమకి పట్టాలు ఇచ్చారని, ఆ పట్టాల్లో ఉన్న భూమిని మాకు చూపించాలని, అప్పటివరకు తాము బాగుచేసుకొన్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగనివ్వబోమని గిరిజనులు రగిలిపోతున్నారు. భూమి సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం అండతో గిరిజనులు ఆందోళనబాట పట్టారు. చర్ల తహసీల్దార్ ఆఫీసు ముందు శిబిరం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం గిరిజనులు మోకాళ్ళపై కూర్చొని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed