ఫారెస్ట్ అధికారుల జులుం.. ఉరికిచ్చి కొట్టిన ఆదివాసీ మహిళలు

by Shyam |
mahabubabd
X

దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో వాన చినుకు పడితే చాలు ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు మధ్య పోరు మొదలవుతుంది. జిల్లాలో ఎక్కువగా గిరిజన రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు. వందలాది సంవత్సరాల నుంచి సాగుచేసుకుంటున్న వ్యవసాయ భూమిలోకి నిత్యం ఫారెస్ట్ అధికారులు చొరబడటం, వేధింపులకు గురిచేయడంతో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు సిద్ధపడ్డ ఘటనలు ఎన్నో ఉన్నాయి.

మంగళవారం గంగారం మండలంలోని మడగూడెం గ్రామంలోని కాకర దొండ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులకు, పోడు రైతులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గంగారం మండలం పరిధిలోని కొంతమంది ఆదివాసీ రైతులు గత కొద్ది సంవత్సరాల నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. మంగళవారం ఫారెస్ట్ అధికారులు.. రైతులు దున్నతున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని తెలుపగా రైతులు ఆగ్రహించి ఆందోళన చేశారు.

పరిస్థితి విషమించడంతో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో రైతులకు, అధికారులకు మధ్య తోపులాటలు జరిగాయి. పోలీసులు జులం ప్రదర్శించడంతో మహిళా రైతులు ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి అయిన కన్నా నాయక్‌పై దాడికి దిగారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ద వాతవరణం తలెత్తింది. కొంత మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆందోళన సద్దుమణిగింది.

mahabubabd1

Advertisement

Next Story

Most Viewed