స్వగ్రామానికి కాలినడకన ప్రయాణం.. 12 ఏండ్ల బాలిక మృతి

by Sridhar Babu |

దిశ‌, ఖ‌మ్మం: కాలిన‌డ‌క‌న స్వ‌రాష్ట్రం చేరుకునే క్ర‌మంలో ఓ 12 ఏళ్ల గిరిజ‌న బాలిక ప్రాణాలు కోల్పోయింది. అట‌వీ మార్గం గుండా రెండు రోజులు నడవడంతో డీ హైడ్రేష‌న్‌కు గురై మ‌ర‌ణించింది. ఈ విషాద సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఛత్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని అడేడ్ గ్రామానికి చెందిన కొంత‌ మంది కూలీలు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని పెరూరు గ్రామానికి వ‌ల‌స వ‌చ్చారు. స్థానికంగా వ్య‌వ‌సాయదారుల పొలాల్లో కూలీకి వెళ్తూ జీవ‌నం సాగించేవారు. అయితే, క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో భాగంగా కేంద్ర‌ ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కూలీల‌కు ప‌ని దొర‌క్కపోవ‌డంతోపాటు వ‌స‌తి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. దీంతో స్వ‌రాష్ట్రం చేరుకునే మార్గం క‌నిపించ‌క‌పోవ‌డంతో కాలిన‌డ‌క‌నే ఎంచుకున్నారు. ఇలా వారితో బ‌య‌ల్దేరిన 25 మంది కూలీల్లో 12 ఏళ్ల బాలిక జామ్లో మద్కామి కూడా ఉంది.

ఈ నెల 16న కాలిన‌డ‌కన స్వ‌రాష్ట్రానికి బ‌య‌ల్దేరిన వీరు 18న‌ బీజాపూర్‌లోని మోడక్‌పాల్‌కు చేరుకున్నారు. ఈ అట‌వీ ప్ర‌యాణంలో 100 కిలోమీటర్లు నడిచిన తర్వాత జామ్లో డీ హైడ్రేష‌న్‌కు గురై మ‌ర‌ణించింది. స్థానికుల నుంచి స‌మాచారం అందుకున్న అక్క‌డి అధికారులు బాలిక మృత‌దేహాన్నిబీజాపూర్ జిల్లా ఆస్పత్రికి త‌ర‌లించారు. డీ హైడ్రేష‌న్‌తోనే బాలిక మృతిచెందిన‌ట్లుగా వైద్యులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. సోమ‌వారం పోస్టుమార్టం నిర్వ‌హించి మృత‌దేహాన్ని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. ఒక్క‌గానొక్క కూతురు మ‌ర‌ణించ‌డంతో బాలిక తండ్రి అండోరం మడ్కం, తల్లి సుక్మతి మడ్కం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

tag:lockdown, Migrant laborers, tribal girl, died, walking, bhadradri kothagudem

Advertisement

Next Story

Most Viewed