చైనాను వీడలేక!

by Shyam |
చైనాను వీడలేక!
X

కరోనా వైరస్ దెబ్బకు దిగ్గజ కంపెనీలన్నీ విలవిల్లాడుతున్నాయి. గతంలో వచ్చిన సంక్షోభాల కంటే ఈ కరోనా తెచ్చిన నష్టం రూ.లక్షల కోట్లలో ఉంది. అంతర్జాతీయంగా అనేక కంపెనీలకు విడి భాగాలను, ముడి సరుకులను అందజేసేది చైనానే. పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ విడి భాగాలు, ఉత్పత్తులకు సంబంధించి చైనాలోనే తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసుకున్నాయి. దీనికి ప్రధానంగా అక్కడి శ్రామికశక్తి అధికం కావడం, ముడిసరుకులు సులభంగా దొరకడం. ప్రస్తుతం కరోనా దెబ్బకు ఈ ఉత్పత్తులు, విడిభాగాలు, ముడి సరుకుల సరఫరా నిలిచిపోవడంతో పెద్ద కంపెనీలన్నిటికీ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దీంతో యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ హార్డ్‌వేర్ ఉత్పత్తులను చైనా నుంచి తరలించడానికి సిద్ధపడుతున్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ఈ ఆలోచనల వైపు అడుగులు వేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.

గతేడాది యూఎస్-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం, కొత్తగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో అమెరికా టెక్నాలజీ సంస్థలైన యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ హార్డ్‌వేర్ ఉత్పత్తుల పరిశ్రమలను చైనా నుంచి తరలించే యోచనలో ఉన్నాయి. కానీ, చైనా నుంచి మరోచోటకు వెళ్లడం అంత సులభం కాదు. ఎందుకంటే, చైనా తయారీ రంగం నుంచి అమెరికాకు సరఫరా చేసే వ్యవస్థ చాలా పెద్దదని గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ ఎండీ షాన్ అన్నారు.

ఈ శతాబ్దపు దిగ్గజ యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు తమ విడి భాగాల ఉత్పత్తులను వియత్నాం, థాయ్‌లాండ్ దేశాలకు తరలించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ హార్డ్‌వేర్ ఉత్పత్తులను వేరే ప్రాంతాలకు మార్చేందుకు ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నాయని గతవారం నికీ ఏషియన్ సర్వే నివేదిక పేర్కొంది. ఇందులో ప్రధాన సమస్య..సరఫరా అయ్యే ఉత్పత్తులను తరలించడం కష్టమైన పని అవుతుంది. దీనికి ఖచ్చితంగా చైనా సహకారం అవసరముటుంది. ఉత్పత్తుల పరిశ్రమలను మార్చడమనే ప్రక్రియ చాలా క్లిష్టమైన వ్యవహారం. అయినా సరే, బడా కంపెనీలు తరలించేందుకే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఈ అంశంపై నిక్కీ అనే సంస్థ తన సర్వేలో…రాబోయే కాలంలో తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను ఉత్పత్తి చేయడానికి గూగుల్ ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ నెలలో పిక్సల్ 4 ఏ పేరుతో వియత్నాంలో దీన్ని విడుదల చేయనుంది. మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ద్వితీయార్థంలో తయారు చేయనున్నట్టు నివేదికలో పేర్కొంది. వాయిస్ అసిస్టెంట్-ఎనేబుల్‌డ్ స్పీకర్ వంటి స్మార్ట్‌హోమ్ ఉత్పత్తులకు ఆటంకం ఏర్పడకుండా ఉండే మార్గాలను గూగుల్ సిద్ధం చేయాలని భావిస్తోంది. థాయ్‌లాండ్‌లో నిర్మించేందుకు భాగస్వాములను వెతుకుతున్నట్టు సమాచారం. మరో సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా సర్ఫేస్ లైన్ నోట్‌బుక్, డెస్క్‌టాప్ పీసీ ఉత్పత్తిని వియత్నాంలో ప్రారంభించాలని భావిస్తోంది.

ఈ రెండు కంపెనీల హార్డ్‌వేర్ ఉత్పత్తులు ప్రధానంగా చైనాలో తయారవుతున్నాయి. గతేడాది యాపిల్ తన ఎయిర్‌పాడ్స్ ప్రోడక్ట్ వియత్నాంలోనే ట్రయల్ ప్రారంభించాలని ప్రయత్నించింది. చైనా నుంచి సౌత్ ఈస్ట్ ఆసియాలోని ఇతర ప్రాంతాలకు 15 శాతం నుంచి 30 శాతం ఉత్పత్తిని తరలించాలని సరఫరాదారులను కోరింది.

ఈ ప్రక్రియకు ప్రధాన కారణం..ఎలక్ట్రానిక్ వస్తువులైన కంప్యూటర్ల డిస్‌ప్లేలు, మెమొరీలు, కెమెరాల వంటి పరికరాలు ఇక్కడినుంచే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. చైనా నుంచే అంతర్జాతీయంగా 40 శాతం వస్తువులు సరఫరా అవుతున్నాయి. ఒక్క చైనానే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ స్థాయి ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కాబట్టి ఉత్పత్తి, అసెంబుల్ ప్రాసెస్ కోసం బాగా అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ సమయంలోనే చైనా నుంచి మారడం ఖాయంగా కనిపిస్తోందని సంబంధిత అధికారి ఒకరు అన్నారు. అయితే, విడిభాగాలు సుమారు 60 శాతం చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే సులభంగా ఇక్కడి నుంచి పరిశ్రమలను తరలించడానికి ఆలస్యమవుతోంది.

ఒక సంస్థను తరలించడంలో విడిభాగాలదే అతిపెద్ద సమస్య. చైనా వెలుపల విడిభాగాల తయారీని తరలించడం చాలా కష్టమసాధ్యమైన వ్యవహారం. మరో దేశంలో ఇంతటి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏళ్లకేళ్లు సమయం పడుతుంది. కొన్నిటిని వేరే చోటికి తరలించవచ్చు. కానీ, ఉత్పత్తి మార్గాలను ఏర్పాటు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతే కాకుండా చైనాలో ఉన్నంతగా శ్రమ శక్తి ఇతర దేశాల్లో దొరకడం కష్టం. పైగా, కంపెనీలు ఆధారపడుతున్న విడిభాగాల సరఫరాదారుల తయారీ కేంద్రాలు చైనాలోనే ఎక్కువగా కలిగి ఉన్నారు.

‘చైనా నుంచి సరఫరా ఉత్పత్తులను దూరంగా తరలించడమనేది ఒక విమానాన్ని నెమ్మదిగా తిప్పడం లాంటిది..చాలా కంపెనీలు తమ సరఫరాలో నష్టాలను తగ్గించే వ్యూహాల గురించి ఆలోచిస్తున్నాయని’ ఆరిట్ సంస్థ అధికారి చెప్పారు. సంస్థలు తొందరగా తరలించానుకుంటేనో, పెట్టుబడులను రాబట్టుకోవాలనుకుంటేనో చేయవచ్చు. దానికి స్థానిక ప్రభుత్వాలతో, వ్యాపారస్తులతో భాగస్వామ్యం కోరుకోవాల్సి వస్తుంది. దీనికి ఇప్పటికే దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం మొదలైన దేశాలు వీలైనంత తొందరగా అనుమతులివ్వగలవు. కానీ, చైనా నుంచి కంపెనీలను తరలించడం ఆయా సంస్థలకు భారీ నష్టాల్ని తెచ్చిపెడతాయి.

Advertisement

Next Story