విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు.. కేసీఆర్ సర్కార్‌కు నారాయణ మూర్తి సూచన

by GSrikanth |
విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు.. కేసీఆర్ సర్కార్‌కు నారాయణ మూర్తి సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు అని, వారి జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడటం దారుణమని ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. పేపర్ లీకేజీలతో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దని ప్రభుత్వాలకు సూచించారు. సోమవారం హిమాయత్ నగర్‌లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ, పదో తరగతి పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతు తెలిపిన ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది నిరుద్యోగులు, విద్యార్థులు ఈ పేపర్ లీకేజీలతో నిరాశ చెంది ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదముందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా టెన్త్ పేపర్ లీకేజీలో ఏ1 గా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై న్యాయ విచారణ జరిపి, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా విద్యా కాషాయీకరణ, కార్పోరేటీకరణకు దోహదం చేసే విధంగా నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు శువం బెనర్జీ మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు విద్యావ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అనంతరం ఆయన దీక్షను విరమింపజేశారు. ఈ దీక్షకు వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. దీక్షలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రెహమాన్, నాగ జ్యోతి రఘురాం, గ్యార క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed