కరోనా ముందుస్థాయికి ప్రైవేట్ ఉద్యోగాలు!

by Harish |
కరోనా ముందుస్థాయికి ప్రైవేట్ ఉద్యోగాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం, సంబంధిత సవాళ్ల నుంచి ఆర్థికవ్యవస్థ కోలుకోవడంతో భారత్‌లో ఉద్యోగాలు కరోనా ముందునాటి స్థాయికి చేరుకుంటున్నాయని ప్రైవేట్ ఉద్యోగ నియామకాల సంస్థలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా చాలావరకు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో ఉద్యోగాల నియామకాలు పుంజుకుంటున్నాయని క్వెస్ కార్పొరేషన్ తెలిపింది. క్వెస్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా అనేక ప్రైవేట్ కంపెనీలకు ఉద్యోగులను ఎంపిక చేస్తోంది.

కరోనా ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా అక్టోబర్‌లో ఉద్యోగాల నియామకాలు పెరిగి మార్చిలో నమోదైన 3.25 లక్షలకు చేరుకున్నట్టు పేర్కొంది. ‘ఉపాధి రంగంలో నియామకాలు వేగంగా వృద్ధి సాధించడాన్ని చూస్తున్నాం. ప్రస్తుత ఏడాది మొదట్లో నమోదైన గణాంకాలే మళ్లీ గత నెల్లో నమోదయ్యాయి. ఆర్థికవ్యవస్థ గాడిన పడుతున్న దానికి ఇదే రుజువు. కరోనా ప్రభావం తగ్గిపోయిందని భావిస్తున్నామని’ క్వెస్ కార్పొరేషన్ ఛైర్మన్ అజిత్ ఐజాక్ చెప్పారు.

నిరుద్యోగ రేటును గమనిస్తే..ఏప్రిల్‌లో 23.5 శాతంగా ఉండగా, అక్టోబర్‌లో 6.98 శాతానికి తగ్గిందని, ఈ త్రైమాసికం ముగిసేలోపు కరోనాకు ముందున్న 7 శాతంలోపు రావొచ్చని ఆయన పేర్కొన్నారు. కరోనా తర్వాత 90 శాతం కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు, వేతనాల్లో కోతలు విధించబడ్డాయి. అక్టోబర్ నుంచి కరోనాకు ముందున్న వేతనాలనే కంపెనీలు అందిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతున్నట్టు క్వెస్ కార్పొరేషన్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed