టిక్‌టాకర్లను ఆదరిస్తున్న బుల్లితెర

by Jakkula Samataha |
టిక్‌టాకర్లను ఆదరిస్తున్న బుల్లితెర
X

టిక్ టాక్ ఉన్నన్ని రోజులు రెండు వీడియోలు, మూడు లైకులు, నాలుగు డబ్బులతో వాళ్ల జీవితం ఆనందంగా గడిచిపోయింది. కానీ ఇప్పుడు టిక్‌టాక్ లేదు, అది తిరిగి వస్తుందన్న ఆశా లేదు. ఇక టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన వందలకొద్దీ యాప్‌ల కారణంగా ఫాలోవర్లను ఎక్కడ పెంచుకోవాలో అర్థంకాక సతమతమయ్యారు. అలాగని వాళ్లు నిరుత్సాహ పడలేదు. వారి టాలెంట్‌కు మరో దారి వెతుక్కున్నారు. నిజానికి వెతుక్కున్నారు అనడం కంటే అవకాశాలు వాళ్లను వెతుక్కుంటూ వచ్చాయని అనవచ్చు. టిక్‌టాక్‌తో మొన్నటి వరకు మొబైల్ స్క్రీన్‌లో మెరిసిన వీళ్లు, ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి బుల్లితెర మీద సందడి చేస్తున్నారు. టిక్‌టాక్‌లో మిలియన్ల ఫాలోవర్లను తమ అందం, అభినయం, మాటకారితనం, డ్యాన్సులతో ఆకట్టుకున్న ఓ ఇద్దరు టిక్‌టాక్ స్టార్లు ఇప్పుడు ప్రముఖ ఛానళ్లలో కనిపిస్తున్నారు. వారెవరో చూద్దాం!

దిల్‌ఖుష్ దివ్య

రక్తంలో కన్నడ మూలాలు ఉన్నప్పటికీ మోటివేషన్ మాటలను ఎలాంటి తడబాటు లేకుండా తెలుగులో టకటకా చెబుతూ టిక్‌టాక్‌లో పేరు సంపాదించుకున్న దివ్య.. ఇప్పుడు సాక్షి టీవీలో సందడి చేస్తోంది. ఆమె తెలుగు మాటల్లో వచ్చే కన్నడ పదాల వాసనకు ఎంతో మంది ఫిదా అయ్యారు. ఇప్పుడు ఒక ఫన్నీ రిపోర్టర్‌గా గరం గరం వార్తలు అనే ప్రోగ్రామ్‌లో కనిపిస్తోంది. ఇటీవల పాపులర్ యాంకర్ బిత్తిరి సత్తి సాక్షి టీవీలో చేరిన సంగతి తెలిసిందే. మొదటి అవకాశంతోనే బిత్తిరి సత్తితో పనిచేసే అవకాశం రావడం నిజంగా దివ్య అదృష్టమనే చెప్పాలి. రోజుకొక ఫన్నీ టాపిక్‌తో రోడ్ల మీద రిపోర్టింగ్ చేస్తూ దిల్‌ఖుష్ దివ్య పేరుతో ఇప్పుడు అందరి మనసులను దోచుకుంటోంది.

బ్యూటిఫుల్ భాను

టిక్‌టాక్‌లో భాను అంటే తెలియని తెలుగు కుర్రాడు ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హిందీ హీరోయిన్లను కూడా తలదన్నే నడుము, డ్యాన్స్, అలనాటి మేటి నటీమణులకు సాటిగా నిలిచే అభినయం, ఈనాటి తెలుగు నటీమణులకు సరితూగే అందంతో భాను ఎందరో మనసులను దోచుకుంది. టిక్‌టాక్‌లో ఆమె పెట్టిన ఒక్కో డ్యాన్స్ వీడియోకు కొన్ని మిలియన్ల వీక్షణలు వచ్చేవి. ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ.. ఇలా పాట, డైలాగ్.. ఏదైనా సరే వాటిని భాను చేస్తే కొత్త అందం వచ్చేది. ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లలో భానుకు ఉన్నన్ని ఫ్యాన్ పేజీలు ఏ టిక్‌టాక్ స్టార్‌కు కూడా లేవు. ఇన్నాళ్లు మొబైల్ తెర మీద అలరించిన భాను… ఇప్పుడు తన అందాలు, హొయలతో బుల్లితెరను షేక్ చేయడానికి వచ్చేస్తోంది. జీ సరిగమప ప్రోమోలో భానును చూసిన వాళ్లందరూ ఆమె ముఖంలో, నడకలో ఉన్న గ్రేస్ చూసి ముక్కున వేలేసుకున్నారు. ఆ ప్రోమోలో అవకాశం సంపాదించుకోవడం ఒక ఎత్తయితే, ఇప్పుడు కొత్తగా ఈటీవీ వారి ‘2020 అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి’ అనే ప్రోమోలో భాను, హైపర్ ఆది పక్కన కనిపించింది. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ వారి దృష్టిలో భాను పడిందంటే ఇక ఆమెకు తిరుగుండదు. కానీ అవకాశాలను ఆచితూచి వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.

‘ఉపాయాలు ఉన్నోడికి ఉపవాసం ఉండాల్సిన పని లేదు’ అనడానికి వీళ్లే నిదర్శనం. టిక్‌టాక్ పోయింది కదా.. మాకు దిక్కులేదు అని మనస్తాపానికి గురవుతున్న వాళ్లందరూ వీళ్లని ఆదర్శంగా తీసుకోవచ్చు. టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు అవే వస్తాయి. కాబట్టి వేచి చూడాలి. లేదంటే వేరే అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి.

Advertisement

Next Story