శాలరీ ఇవ్వట్లేదని ఐఫోన్లు దొంగిలించారు!

by Shyam |   ( Updated:2020-12-14 05:44:44.0  )
శాలరీ ఇవ్వట్లేదని ఐఫోన్లు దొంగిలించారు!
X

దిశ, వెబ్‌డెస్క్: మీరు పనిచేస్తున్న ఆఫీస్‌లో నెల జీతం ఇవ్వకపోతే.. ఏం చేస్తారు? ఎందుకు ఇవ్వడం లేదని పైస్థాయి ఆఫీసర్లు లేదా యాజమాన్యాన్ని అడుగుతారు? ఎప్పటిలోగా ఇస్తారో వివరంగా కనుక్కుంటారు? నిర్దేశించిన తేదీల్లో కూడా ఇవ్వకుండా ఉంటే.. అప్పుడు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. కార్మిక శాఖ రూల్స్ ప్రకారం.. సంస్థపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ, ఇక్కడ ఉద్యోగులు అలా చేయలేదు. అగ్రిమెంట్‌లో తెలిపినంత వేతనం ఇవ్వడం లేదని ఏకంగా సొంత సంస్థకే కన్నం పెట్టారు. సంస్థ రూపొందిస్తోన్న ఐఫోన్లను వేల సంఖ్యలో దొంగిలించడమే కాకుండా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లపై దాడి చేశారు. ఫర్నిచర్, ఎక్విప్‌మెంట్స్ నాశనం చేశారు. దాంతో సంస్థకు రూ.437 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

థైవాన్ దేశానికి చెందిన విస్ట్రన్ కంపెనీ.. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కోలార్ జిల్లాలోని నర్సాపురలో మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఎలక్ట్రానిక్ డివైజెస్‌కు డిజైన్లు ఇస్తూనే సొంతంగా మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తుంది. స్పెషల్ ఎడిషన్ ఐఫోన్లు, ఐఫోన్ ప్రొడక్ట్స్, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఎలక్ట్రానిక్ డివైజెస్‌ను ఈ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇందుకుగానూ నర్సాపురలో రూ.2,900 కోట్లు పెట్టుబడి పెట్టిన సంస్థ, 10 వేల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. అయితే రిక్రూట్‌మెంట్ సమయంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు రూ.21 వేల శాలరీ ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.16 వేలు మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. నాన్-ఇంజినీరింగ్ ఉద్యోగులకు శాలరీ సగానికి తగ్గించారని, నెల నెల తమకు క్రెడిట్ అయ్యే వేతనం తగ్గిపోవడం పట్ల తాము విసిగిపోయామని ఓ ఉద్యోగి తెలిపాడు. అంతేకాదు కొంతమంది ఉద్యో్గులకు నెల జీతంగా రూ.500 కూడా ఇచ్చారట. ఈ నేపథ్యంలో సుమారు 2 వేల మంది ఉద్యోగులు శనివారం కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌కు వెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించారు. కంపెనీ ఎక్విప్‌మెంట్‌తో పాటు ఫర్నిచర్ మొత్తం నాశనం చేశారు. ప్లాంట్ వద్ద ఉన్న వెహికల్స్‌ను తగులబెట్టేందుకు యత్నించారు. ఆఫీసులో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, ఆఫీసర్లపై దాడి చేశారు. వేల ఐఫోన్లు ఎత్తుకెళ్లారు. మొత్తంగా సంస్థకు రూ.440 కోట్ల నష్టం వాటిల్లిందని కంపెనీ పేర్కొంది. కాగా, ఈ ఘటనపై కర్నాటక కార్మిక శాఖ మంత్రి శివరాం హెబ్బర్ స్పందించారు.

విస్ట్రన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌పై ఉద్యోగుల దాడిని ఖండించారు. ఉద్యోగులు థర్డ్ పార్టీ ద్వారా భర్తీ చేయబడ్డారని తెలిపారు. కంపెనీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వారిని రిక్రూట్ చేసుకుందని చెప్పారు. కంపెనీలో 8,900 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, 1200 మంది పర్మినెంట్ ఎంప్లాయిస్ ఉన్నారని వివరించారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందన్నారు. కానీ, జీతాలు చెల్లించాలని అప్పటికే కంపెనీ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్‌కు డబ్బులిచ్చిందని, కానీ అతను వారికి వేతనమివ్వలేదని తెలిపారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న జీతం మూడ్రోజుల్లో అందేవిధంగా కార్మిక శాఖ చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీనిచ్చారు.

Advertisement

Next Story