తినడానికి తిండి లేని రోజులు.. ఒక్క ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది.

by Sujitha Rachapalli |   ( Updated:2021-07-08 09:19:14.0  )
తినడానికి తిండి లేని రోజులు.. ఒక్క ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది.
X

దిశ, ఫీచర్స్ : తినడానికి తిండి లేని స్థాయి నుంచి లక్షల రూపాయలు సంపాదించే యూట్యూబర్‌గా ఎదిగాడు ఒడిశా సంబల్పూర్ జిల్లాకు చెందిన ముండా అనే యువకుడు. ఎంతోమంది జీవితాలను తారుమారు చేసిన కరోనా, ఈ కూలీని కూడా కరువులోకి నెట్టేసింది. పూట గడవడానికి కూడా కష్టమైపోయింది. అదే సమయంలో కాలక్షేపానికి తన స్నేహితుడి మొబైల్‌లో యూట్యూబ్ వీడియోలు చూసేవాడు. అక్కడ ఫుడ్ వ్లాగ్ వీడియోలు పరిచయం కావడంతో, వాళ్ల స్ఫూర్తితో తాను కూడా ఓ చానెల్ ప్రారంభించి వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు. అనూహ్యంగా అవి వైరల్ కావడంతో దాన్ని ఉపాధిగా మలుచుకున్నాడు ముండా.

‘జీవితం ఎల్లప్పుడూ ఏదో ఓ సర్‌ప్రైజ్ అందిస్తూనే ఉంటుంది. కిందపడిపోయామని ఆగిపోతే ఆ సర్‌ప్రైజ్ మిస్ అయిపోతాం. అలా కాకుండా రేపటిపై ఆశతో ప్రయాణం ప్రారంభిస్తే తప్పకుండా విజయం దక్కుతుంది’ అందుకు ఇసాక్ ముండా జీవితమే నిదర్శనం. యూట్యూబ్ చానల్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు కానీ అతడి దగ్గర స్మార్ట్‌ఫోన్ కూడా లేదు. దాంతో 3వేల రూపాయలు అప్పుగా తీసుకుని మొబైల్ కొన్నాడు. మొదటి వీడియోలో పచ్చిమిర్చి, టోమాటో, అన్నం కలిపి తింటున్న వీడియో అప్‌లోడ్ చేశాడు. ఒక్కసారిగా ఆ వీడియో వైరల్‌ అయింది. ఇప్పటివరకు ఆ వీడియో హాఫ్ మిలియన్ వ్యూస్ అందుకుంది. ఇక ముండా ఆ క్రమంలోనే వీడియోలు తీయడం మొదలుపెట్టాడు.

కేవలం ఏడాదిలోనే ఏడున్నర లక్షలమంది అతడి చానల్‌కు సబ్‌స్క్రైబర్స్ అయ్యారు. తన వీడియోలకు గానూ యూట్యూబ్ నుంచి రూ. 5 లక్షలు అందుకోవడంతో అతడి ఫ్యామిలీ కష్టాలన్నీ గట్టెక్కాయి. అంతేకాదు ముండా ఇల్లు నిర్మించుకోవడానికి భువనేశ్వర్‌లోని ఓ సంస్థ కొంత ఆర్థిక సహాయం అందించడం విశేషం. అరువు తెచ్చుకున్న ఫోన్‌లో వీడియోలు చూసే అతడు, నేడు యూట్యూబర్‌గా ఎదగడం వరకు స్ఫూర్తివంతమైన ప్రయాణమది. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం.

https://www.youtube.com/channel/UCtZSw3X_P35s1dV5SzhTd9Q

Advertisement

Next Story