క్షేత్రస్థాయి సిబ్బంది ఇక థర్మల్ స్క్రీనింగ్!

by Aamani |   ( Updated:2020-04-15 05:20:02.0  )
క్షేత్రస్థాయి సిబ్బంది ఇక థర్మల్ స్క్రీనింగ్!
X

దిశ, ఆదిలాబాద్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి కృషి చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది కరోనాతో రోజూ యుద్ధం చేస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా ప్రభావిత రెడ్ జోన్ ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు దఫాలు సర్వే నిర్వహించిన ఆరోగ్య సిబ్బంది తాజా పరిస్థితుల నేపథ్యంలో సర్వే నిర్వహించేందుకు హడలిపోతున్నారు.ఈ నేపథ్యంలో థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు సిబ్బందికి ఇచ్చి అనుమానితులకు పరీక్షలు చేయాలని అధికార యంత్రాంగం ఆదేశాలిచ్చింది.

తొలిరోజుల్లో భయం లేకుండా..

కరోనా ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సర్వే నిర్వహించారు. ఒకటి, రెండు కేసులు వచ్చిన సమయంలో గ్రామ స్థాయిలో పనిచేసే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వేకు వెనుకాడలేదు. అలాగే పర్యవేక్షణ సిబ్బంది, డాక్టర్లు సైతం
ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు చేశారు. కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ఒకరు కరోనా‌తో మరణించగా మరో 19 మందికి కరోనా వైరస్ సోకింది. నిర్మల్ పట్టణం‌తోపాటు ఇతర గ్రామాలకు సైతం సోకింది. ఆదిలాబాద్ జిల్లాలో 11 మందికి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా‌లో ముగ్గురికి కరోనా వచ్చింది. అప్పటి నుంచి ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనలకు భయపడే పరిస్థితి ఎదురవుతున్నది.

కరోనా ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా‌పై ఎక్కువగా ఉన్నందున అనుమానితులను ఎక్కువ మొత్తంలోనే పరీక్షించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది అనుమానితులను మీటరు దూరం నుంచే స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. కాగా బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రానికి ధర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు వచ్చాయి. మొన్నటిదాకా హైదరాబాద్ పట్టణంతోపాటు, ఎయిర్ పోర్టు‌లకు మాత్రమే పరిమితమైన ఈ థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు జిల్లాల్లోనూ పరీక్షలు నిర్వహించేందుకు రావడం ఊరటనిచ్చే అంశమేనని వైద్యులు చెబుతున్నారు. వ్యక్తిని తాకకుండానే.. ఈ స్క్రీనింగ్‌లో కరోనాలో ప్రధాన లక్షణమైన జ్వర నిర్ధారణ పరీక్షలు అక్కడికక్కడే తెలిసి పోతాయి. వ్యక్తిని తాకకుండానే పరీక్ష చేసేందుకు వీలు కలుగుతుంది. ఇక మిగిలిన అనుమానిత లక్షణాలను దూరం నుంచి అడిగి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.

రెడ్ జోన్ ప్రాంతాల్లోనే..

ఈ స్క్రీనింగ్ యంత్రాలతో ముందుగా కరోనా రెడ్ జోన్ ప్రాంతాల్లోనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు స్క్రీనింగ్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభించారు. నిర్మల్ పట్టణంలోని 6 కరోనా ప్రభావిత ప్రాంతాలతోపాటు నర్సాపూర్
మండలం చాక్‌పల్లి, లక్ష్మణ చందా మండలం రాచాపూర్, కనకా‌పూర్, పెంబి మండలం రాయ‌దారి, భైంసా మున్సిపాలిటీ‌లో ముందుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా ఎక్కడైనా అనుమానితులు నమోదైతే వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

విదేశాల నుంచి వచ్చిన వారికి మరోసారి..

విదేశాల నుంచి వచ్చిన వారికి మరో సారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆయా గ్రామాల్లో విదేశాల నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న వారందరికీ సెన్సార్ థర్మల్ స్క్రీనింగ్ మిషన్లతో జ్వర నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత ఇతర అనుమానిత లక్షణాలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుంటారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేనట్లయితే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిని, ఆ కుటుంబాలను కరోనా ఫ్రీ ఫ్యామిలీస్‌గా గుర్తిస్తారు.

Tags: Thermal Screening Machines, Health dept staff, prevention, covid 19, red zones

Advertisement

Next Story