- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం గెజిట్‌పై అభ్యంతరాలున్నాయి.. ఏపీ అభ్యంతరం
దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా, గోదావరి బేసిన్‌లలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆయా నదీజలాల బోర్డుల పరిధిలోకి తీసుకెళ్ళేలా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌లో కొన్ని అభ్యంతరాలున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాఖ్యానించింది. ప్రాజెక్టులకు సంబంధించిన సాధారణ అంశాల్లో బోర్డులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, క్లిష్టమైన అంశాల్లో మాత్రమే వేలు పెడితే సరిపోతుందని స్పష్టం చేసింది. బోర్డులు కోరినట్లుగా ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ప్రభుత్వంతో చర్చించిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని తెలిపింది.
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమన్వయ కమిటీ తొలి సంయుక్త సమావేశానికి ఏపీ ప్రతినిధులు మాత్రమే హాజరుకాగా, తెలంగాణ నుంచి ఎవ్వరూ హాజరు కాలేదు. ఈ సమావేశాన్ని బహిష్కరించింది.
కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డులు వేర్వేరుగా సమన్వయ కమిటీ సమావేశాలను నిర్వహించాలని తొలుత భావించినా ఆ తర్వాత సంయుక్తంగానే నిర్వహించనున్నట్లు ఆగస్టు 2వ తేదీన రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చి ఆ ప్రకారమే మంగళవారం నగరంలోని జలసౌధలో మీటింగ్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీర్-ఇన్-చీఫ్ నారాయణరెడ్డితో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు హాజరయ్యారు. కానీ తెలంగాణ నుంచి మాత్రం ఎవ్వరూ హాజరుకాలేదు. పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాతనే సమన్వయ కమిటీ సమావేశం జరపడం ఉపయోగకరంగా ఉంటుందని, అది లేకుండా తొలి సమావేశంలో పెద్దగా చర్చించే అంశాలేమీ ఉండవని రెండు బోర్డులకు తెలంగాణ లేఖ రాసింది. ఆ ప్రకారమే ఈ సమావేశంలో ఎలాంటి ప్రయోజనం ఉండదనే భావనతో గైర్హాజరైంది.
సమావేశం అనంతరం ఏపీ ఈ-ఇన్-సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గెజిట్ నోటిఫికేషన్‌లో కొన్ని అంశాల్లో తమకు అభ్యంతరాలు ఉన్నాయని, వీటిని తమ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని వివరించినట్లు తెలిపారు. గెజిట్ ప్రకారం అన్ని ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి వెళ్తాయని, కానీ అలాంటి భారం అవసరం లేదని తమ అభిప్రాయాన్ని ఈ సమావేశంలో వెల్లడించినట్లు తెలిపారు. సాధారణ అంశాలను వదిలేసి కేవలం సంక్లిష్టంగా ఉన్న అంశాలపై మాత్రమే బోర్డులు దృష్టి పెట్టి పనిభారాన్ని తగ్గించుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జరిగిన అన్ని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, బోర్డులు కోరినట్లుగానే అన్ని కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత సమర్పిస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు.
ఆ తర్వాత మీడియాతో చిట్‌చాట్ చేసిన నారాయణరెడ్డి, ఈ సమావేశానికి తెలంగాణ తరఫున ఎవ్వరూ ఎందుకు హాజరుకాలేదో తెలియదన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న కృష్ణా జలాలను తాము తీసుకోవాలనుకున్నా తెలంగాణ దానికి ఒప్పుకోకుండా వాటా లెక్కల్లో జమ చేయాలని వాదిస్తున్నదని, ఇది సహేతుకంగా లేదన్నారు. ప్రస్తుతం కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయని, కానీ భవిష్యత్తులో గోదావరి జలాలతోనే సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదని, గోదావరి నదీ యాజమాన్య బోర్డు కీలకంగా మారబోతున్నదని అభిప్రాయపడ్డారు.