అది చూసి మోసపోతున్న యువకులు

by Anukaran |
అది చూసి మోసపోతున్న యువకులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అక్రమంగా డబ్బులు సంపాదించే వారు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఆన్‌లైన్‌లో భారీగా డబ్బు సంపాదించొచ్చని గ్రామీణ యువతకు ఆశ కల్పిస్తున్నారు. దీంతో యువకులు అప్పుచేసి మరీ.. తమ అకౌంట్‌లో డబ్బులు వేసుకుని 24 గంటల పాటు స్మార్ట్‌ఫోన్లలో ఆడుతూ కూర్చుంటున్నారు. డబ్బులు పోగొట్టుకుంటున్న వారు ఆడడం మానేసినా నిర్వాహకులు వదలడం లేదు. డబ్బులొస్తాయని మాయమాటలు చెప్పి మళ్లీ ఆడేలా ప్రోత్సహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులు ఎక్కువగా ఈ గేమ్‌కు అడిక్ట్ అవుతున్నారు.

ప్లే స్టోర్‌లో లేని యాప్..

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్‌లో తమకు నచ్చిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ ఈ గేమ్ మాత్రం రెఫరల్ ద్వారానే ప్రమోట్ అవుతోంది. రెఫరల్ బోనస్ కింద ఒక్కో కస్టమర్‌కు రూ. 100 చొప్పున అందిస్తున్నారు. లింక్ షేర్ చేయడం ద్వారా కొత్తగా జాయిన్ అయిన వారు గేమ్‌లో పాల్గొంటే రూ. 20 కూడా ఇస్తున్నారు. ఒకరి నుంచి మరొకరు.. ఇలా వేలాది మంది స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకున్న ఈ గేమ్ ఇప్పుడు అందరి జేబులను గుల్ల చేస్తోంది. ‘విన్ గో’ యాప్ పేరిట జరుగుతున్న ఈ గేమ్‌లో అంతా మోసమేనని తెలుస్తోంది.

గేమ్‌లో త్రీ కలర్స్..

విన్ గో గేమ్‌‌లో మూడు రకాల కలర్స్ ఉంటాయి. ఆట ఆడే వ్యక్తి ఒక కలర్‌ను ఎంపిక చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న కలర్‌కు డబ్బులు వస్తే.. వారు బెట్టింగ్ వేసిన డబ్బులకు రెండింతలను ప్లేయర్ వ్యాలెట్‌లో యాడ్ అవుతాయి. ఒక వేళ వేరే కలర్ అయితే వారి వ్యాలెట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఒకే సారి నాలుగు గేమ్స్ ఆడే అవకాశం ఉండడంతో చాలా మంది నాలుగింటిల్లో బెట్టింగ్ పెడుతున్నారు. ఒక గేమ్‌లో గెలిస్తే మూడింట్లో డబ్బులు పొగొట్టుకుంటున్నారు.

గేమ్ ఆడకపోతే..

గేమ్‌లో నిత్యం డబ్బులు పోవడమే తప్ప రావడం లేదని కొందరు గేమ్ ఆడడం ఆపేస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపు ద్వారా నిర్వాహకులే ఈ సారి ఫలానా కలర్‌కు డబ్బులు వస్తాయని మెసేజ్ చేస్తున్నారు. దీంతో వెంటనే మళ్లీ గేమ్‌లోకి వెళ్లి.. బెట్టింగ్ వేస్తున్నారు. తరువాత మళ్లీ షరా మాములే నిర్వాహకుడి మాయాజాలంలో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అంతేకాకుండా వాట్సప్ గ్రూపు ద్వారా ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తే వారి వ్యాలెట్‌కు డబ్బులు పంపించిన స్క్రీన్ షాట్లు కూడా గ్రూపుల్లో పోస్ట్ చేస్తారు. దీంతో తమకు డబ్బులు రాకపోతాయా అన్న ఆశతో కొంతమంది ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి గేమ్ ఆడి బొక్కబోర్లా పడుతున్నారు.

గ్రామీణ యువతే..

ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతే ఈ ఆట మోజులో పడిపోతున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో మునిగిపోతే వారి పిల్లలేమో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలవుతున్నారు. రూ. 10 నుంచి ఎంత మొత్తంలో అయినా బెట్టింగ్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇలాంటి గేమ్ విషయంలో యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి మట్కా పోలిన ఈ గేమ్ ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story