ఆ పని చేసిందని.. భార్యను 30కేజీల ఇనుప చైన్‌తో..

by Sumithra |   ( Updated:2021-07-01 00:36:50.0  )
husband torture news
X

దిశ, వెబ్‌డెస్క్: భార్యపై అతని అనుమానం పెనుభూతమైంది. అతనిలోని వివేకాన్ని చంపేసింది. భార్య కూడా ఒక మనిషే అనే ఆలోచనను చిదిమేసింది. ఆ అనుమానంతోనే భర్త రాక్షసుడిగా మారి భార్యను చిత్రహింసలకు గురిచేస్తోన్న ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని ఒక గ్రామంలో ఓ వ్యక్తి(45), తన భార్య(40) తో కలిసి నివాసముంటున్నాడు. గత కొన్నిరోజుల నుంచి భార్య తరుచూ పుట్టింటికి వెళ్తోంది. అయితే తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడం వలెనే తరుచూ పుట్టింటికి వెళ్తుందని అనుమానించిన భర్త ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయమై భార్యతో ఎప్పుడు గొడవపడుతుండేవాడు.

భార్య అలాంటిదేమి లేదని, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి సాయం చేయడానికే తాను పుట్టింటికి వెళ్తున్నానని చెప్పినా భర్త వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలోనే హోలీ పండగకు రెండు మూడు రోజుల ముందు భార్యతో తో వివాదానికి దిగిన భర్త ఆవేశంతో 30 కిలోల ఇనుప చైన్ తో భార్యను ఒక గుంజకు కట్టేసి చిత్ర హింసంలు పెట్టడం మొదలు పెట్టాడు. రోజు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆమెను ఇష్టంవచ్చినట్లు కొట్టేవాడు. అలా మూడు నెలలగా భార్యకు నరకం చూపించాడు. పక్కింట్లో కేకలు, అరుపులు విన్న చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, భర్తను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story