హరీశ్‌రావు నియామకం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?

by Anukaran |
హరీశ్‌రావు నియామకం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఉదయం మొదలు రాత్రి వరకు విస్తృత ప్రచారాలతో అభ్యర్థులు తీరిక లేకుండా సన్నాహక సమావేశాలు, డోర్‌ టు డోర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మార్నింగ్ వాక్‌లంటూ పార్కుల్లో సైతం ప్రచారం నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా టీఆర్ఎస్-బీజేపీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికపైనే అందరి దృష్టి పడింది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు గతంలో ఇక్కడి నుంచి విజయం సాధించారు. రెండోసారి గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. దీంతో అభ్యర్థి విషయంలో ఆచితూచీ అడుగులు వేసిన గులాబీ బాస్‌.. చివరకు అనూహ్యంగా మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహా రావు కుమార్తె సురభి వాణీదేవిని నిలబెట్టారు. ఇదే సమయంలో ఆ నియోజకవర్గానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాలతో రాజకీయం మరింత వేడెక్కింది.

తెరపైకి హరీశ్రావు..

అధిష్టానం నిర్ణయంతో పార్టీ నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓ వైపు ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను అధిగమిస్తూనే మరోవైపు కొత్త హామీలతో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి, హరీశ్ రావు జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా సవ్యంగా ఉన్నా ప్రతిపక్షాలు మాత్రం కొత్త రాజకీయానికి తెరలేపుతున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓటమి తప్పదని జోస్యం చెబుతున్నాయి. ఇటీవల దుబ్బాకకు ఇన్‌చార్జీగా హరీశ్ రావు ఉన్నారని.. ఆ స్థానంలో పార్టీ ఓటమి తెలిసే ఆయనకు బాధ్యతలు అప్పగించినట్టు ప్రతిపక్ష నేతలు బహిరంగంగానే చెప్పారు. దుబ్బాక ఓటమి తర్వాత పెద్దగా కనిపించని హరీశ్ రావు తాజాగా ఇన్‌చార్జి ఇవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ కూడా గులాబీ పార్టీకి ఓటమి ఖాయమని.. అది తెలిసే మళ్లీ హరీశ్‌ రావుకు బాధ్యతలు అప్పగించారని ప్రెస్‌మీట్‌పెట్టి ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నా్రు.

ఇక ప్రతిపక్షాల ఆరోపణలు అధికార పార్టీకి ఏమైనా ప్లస్ పాయింట్ అవుతాయా అని కూడా చర్చలు నడుస్తున్నాయి. దుబ్బాక ఓటమి తర్వాత హరీశ్ రావుపై ప్రజల్లో కాస్త సానుభూతి పెరిగిందని ఓ వర్గం వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, హరీశ్ రావుపై వచ్చిన సానుభూతి అనేది హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానంపై ఉంటుందని భావిస్తున్నారు. ఒక వేళ ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయితే.. ప్రతిపక్షాల వ్యాఖ్యలు పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చనున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, గ్రాడ్యుయేట్ ఓటరు నాడి ఏ వైపు ఉందనేది ఏ పార్టీకి కూడా అంతుచిక్కకుండా మారింది. ఈ పరిణామాలతో ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత వేడిపుట్టిస్తున్నాయి. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఫలితాలు వచ్చేవరకు వేచిచూడాల్సిందే అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed