రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసు కీలక మలుపు

by Sumithra |   ( Updated:2021-07-16 07:37:32.0  )
Murder Case,
X

దిశ, ఏపీ బ్యూరో: పుత్రుడు తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి కాపాడతాడని ఓ నానుడి ఉంది. అయితే ఆ కొడుకు తండ్రికి పున్నామ నరకం నుంచి తప్పించాడో లేదో తెలియదు గానీ అర్ధాంతరంగా ఆయుస్సు తీసేశాడు. బతికున్నంతకాలం నరకం చూపించి చివరకు దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో చోటు చేసుకుంది.

నరసరావుపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంగమాంబ మల్లికార్జునరావు వ్యాపారంలో బాగా సంపాదించాడు. మంచి పేరుకూడా ఉంది. అయితే అతడి కొడుకు సాయికి మధ్య కలహాలు చెలరేగాయి. కొడుకు వ్యసనాలకు బానిసగా మారడంతో మల్లికార్జున రావు అతడిని అంతగా పట్టించుకునేవాడు కాదు. డబ్బులు అడిగినా ఇచ్చేవాడు కాదు. దీంతో కొడుకు తండ్రిపై కోపం పెంచుకున్నాడు. తన తండ్రిని అంతమెుందిస్తే ఆస్తిఅంతా తనకేనని భావించాడు. అంతే ఈనెల 7న మరో ఎనిమిది మందితో కలిసి తన తండ్రిని హత్య చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సొంత కొడుకే తండ్రిని హత్య చేయించినట్లు తమ విచారణలో తేలిందని గుంటూరు రూరల్ అదనపు ఎస్పీ మూర్తి తెలిపారు. నిందితులను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రధాన నిందితుడు సాయితోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితుల నుంచి కత్తులు, రాడ్లు, సెల్ ఫోన్లు, ఒక ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ మూర్తి తెలిపారు. నిందితులను సాంకేతిక పరిజ్ఞానం.. సెల్‌ఫోన్ డేటా ఆధారంగా పట్టుకున్నట్లు తెలిపారు. 10 రోజుల్లోనే కేసును చేధించినట్లు ఏఎస్పీ మూర్తి తెలిపారు.

Advertisement

Next Story