జెట్‌ స్పీడ్‌‌‌లో విచారణ.. సీఎస్‌కు చేరిన ఈటల ప్రాథమిక నివేదిక

by Anukaran |
Minister Etela Rajender
X

దిశ, తెలంగాణ బ్యూరో: “ రాజు తలుచుకోవాలే గానీ..” అన్నట్టుగా మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలపై ఆగమేఘాల మీదు అధికార యంత్రాంగం కదిలింది. తెల్లావారేసరికి రెవెన్యూ యంత్రాంగం విచారణకు దిగింది. ఒక రైతుకు పాస్ పుస్తకం ఇవ్వాలంటే సవాలక్ష కారణాలు చూపిస్తూ ఏండ్ల తరబడి తిప్పుకునే అధికారులు క్షణాల్లో అచ్చంపేటలో తేలారు. దాదాపుగా 8 ఏండ్ల నుంచి ఒక్క తెల్ల రేషన్​ కార్డు లేదు.. ఆరోగ్య శ్రీ కార్డు లేదు.. రోగాలతో సచ్చిపోతున్నాం.. ఎంక్వయిరీ చేసి కార్డు ఇవ్వండి అంటూ మొత్తుకుంటున్నా కనికరించని ప్రభుత్వం.. ఈటల వ్యవహారంలో మాత్రం జెట్ స్పీడ్‌లో విచారణ ప్రారంభించారు.

ఎట్టకేలకు ప్రాథమిక విచారణ తొలి నివేదిక సీఎస్‌కు చేరిందని అధికారవర్గాల సమాచారం. శనివారం ఉదయమే మాసాయిపేట మండలం అచ్చంపేటకు వెళ్లిన రెవెన్యూ అధికారుల బృందం పలువురు రైతులను కలిసింది. అక్కడ భూమి, షెడ్డుల నిర్మాణాలను ఫొటోలతో తీసుకున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ద్వారా ప్రాథమిక నివేదికను సీఎస్‌కు పంపించారు. కేవలం గంటల వ్యవధిల్లోనే ఈ నివేదిక సిద్ధమైంది. మరోవైపు కొంత ఆలస్యంగా విజిలెన్స్ బృందం విచారణకు దిగింది. విజిలెన్స్ సీఐతో పాటు పలువురు అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ సీఐని క్షేత్రస్థాయికి పంపించగా.. విజిలెన్స్ డీజీతో పాటు ముగ్గురు ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి వివరాలను సేకరించుకున్నారు. అసలే సీఎం కేసీఆర్ ఆదేశాలు కావడంతో… అధికారులు పరుగులు పెడుతున్నారు.

అంతా పాతదే కదా..?

మరోవైపు ఈ భూ వ్యవహారంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హడావుడి చేస్తుందనే ప్రచారం కూడా మొదలైంది. ఈ భూమికి సంబంధించిన వివరాలు, జరిగిన పరిణామాలన్నీ మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి, పూర్వ జాయింట్ కలెక్టర్ నగేష్ నుంచి సమగ్ర వివరాలు తీసుకున్న తర్వాతే ప్రభుత్వం మీడియాకు లీక్ చేసిందనే అభిప్రాయాలున్నాయి. దీన్ని రెగ్యులర్ చేయాలంటూ మంత్రి ఒత్తిడి తీసుకువచ్చిన వ్యవహారాన్ని మొత్తం ధర్మారెడ్డి నుంచి సీఎంకు అందించారంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత ఆరోపణలురావడం, దీనిపై ప్రభుత్వం ఏదో హడావుడి చేసి విచారణకు ఆదేశించడం ఒక విధమైనప్లాన్‌లో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story