పుర ప్రచారం 8 గంటల వరకే

by Shyam |
పుర ప్రచారం 8 గంటల వరకే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న పురపోరు ప్రచార సమయాన్ని కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు అత్యవసర ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్​ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ప్రచారపర్వాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేసింది. గతంలో రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ నైట్​ కర్ఫ్యూ దృష్ట్యా రెండు గంటల సమయాన్ని తగ్గించారు.

అదే విధంగా లౌడ్​ స్పీకర్లు, మైక్​ల వాడకంపై కూడా నిబంధనలు విధించారు. ప్రచారం మినహా ఇతర కార్యక్రమాలు, ప్రార్థనల కోసం మైక్​లను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే వినియోగించాలని, ఆ తర్వాత వినియోగించరాదంటూ సూచించింది. కోవిడ్​ నిబంధనలను పాటిస్తూ ప్రచారం చేసుకోవాలని, మాస్క్​లను తప్పనిసరిగా వాడాలని, ఐదుగురి కంటే ఎక్కువ మంది కలిసి ప్రచారం చేయరాదంటూ ఆంక్షలను మరోసారి వివరించారు. రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు, 8 వార్డులు, ఒక డివిజన్​కు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న వీటికి పోలింగ్​ నిర్వహిస్తుండగా… ఈ నెల 28 వరకు ప్రచారానికి అనుమతి ఉంది.

Advertisement

Next Story