మార్కెట్​ యార్డుల్లో ట్రేడర్లదే ఇష్టారాజ్యం

by Anukaran |
మార్కెట్​ యార్డుల్లో ట్రేడర్లదే ఇష్టారాజ్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బంగారు తెలంగాణ నినాదం ప్రశ్నార్థకంలో పడుతోంది. “నేనే పెద్ద రైతును.. నా కంటే వ్యవసాయం తెలిసిన రైతు ఎవడూ లేడు.. పెద్ద కాపును నేనే.. కోటి రూపాయల పంట తీస్తున్నా అంటూ చెప్పే సీఎం కేసీఆర్​.. ఒక్కసారిగా నాగలి ఎత్తేశాడు. రైతుల ఖర్మకు రైతులను వదిలేశాడు. ” రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్​ చెప్పిన ప్రతి మాట ఇప్పుడు రాష్ట్ర రైతాంగం చెవుల్లో వినిపిస్తూనే ఉంది. వ్యవసాయంలో ధనిక రాష్ట్రంగా తెలంగాణను చేస్తామని, ధనికులైన రైతులు ఎక్కడ ఉన్నారంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అనే విధంగా చేస్తామంటూ ప్రకటించారు. కానీ తాజాగా సీఎం కేసీఆర్​ తీసుకున్న నిర్ణయాలు రైతులను అగాథంలో పడేస్తున్నాయి. ప్రతి రైతు కుటుంబానికి నేనే పెద్ద బిడ్డను అంటూ చెప్పుకునే సీఎం… ఇప్పుడు నడిగట్లలో నాగలి ఎత్తేశాడంటున్నారు. నియంత్రిత సాగు విధానాన్ని తీసుకువచ్చిన సీఎం ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. రైతును ఇబ్బందులు పెట్టు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించారు. కానీ ఒక్కసారిగా మాట మార్చారు. పంటలు వేయడం, అమ్ముకోవడం రైతుల ఇష్టమే… ఒక విధంగా రైతుల ఖర్మే అన్నట్టుగా ప్రకటించారు. దీంతో రైతులు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు.

ఓసారి పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటే…

2005లో కరీంనగర్​ జిల్లాలో పలు మార్కెట్​ యార్డులను రైతులు నిప్పు పెట్టారు. సెప్టెంబర్​ నెలలో మొక్కజొన్నను తీసుకు వచ్చిన రైతులు అప్పుడు మద్దతు ధర రూ. 540 ఉంటే మార్కెట్​ యార్డుల్లో రూ. 100 తగ్గించి కొనుగోళ్లు చేశారు. దీంతో ప్రైవేట్​ ట్రేడర్లపై మండిపడి కరీంనగర్​ పెద్ద మార్కెట్​, హుస్నాబాద్​, హుజురాబాద్​ మార్కెట్​ యార్డుల్లో రైతులు దాడులు చేసి గోదాములు, కార్యాలయాలకు నిప్పు పెట్టారు. అప్పుడే కరీంనగర్​ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకున్నారు. కేవలం పక్షం రోజుల వ్యవధిలో ప్రణాళిక తయారు చేసి స్వయం స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లను 2005 అక్టోబర్​ 2 నుంచి ప్రారంభించారు. ఇది మార్కెట్​ రంగంలో అతిపెద్ద మార్పు. అంతే మొక్కజొన్న కొనుగోళ్లు సాఫీగా జరిగాయి.

ఇక 2006లో మళ్లీ అదే కథ. ఈసారి ధాన్యం రైతులు. వరంగల్​ ఏనుమాముల మార్కెట్​, కరీంనగర్​ వ్యవసాయ మార్కెట్​, కే సముద్రం మార్కెట్​… ఇలా ప్రతి జిల్లాలో మార్కెట్​ యార్డుల ఎదుట రైతులు దాడులకు దిగారు. ఈ సమయంలో సివిల్​ సప్లై ఆధ్వర్యంలో అప్పడు గ్రామీణాభివృద్ధి శాఖ సాయం కోరారు. సీఎం వైఎస్​ రాజశేఖర్​రెడ్డి వెంటనే కరీంనగర్​ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను రంగంలోకి దింపారు. వెంటనే ఫైలట్​ ప్రాజెక్టుగా కరీంనగర్​ జిల్లాలో మహిళా సంఘాలతో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. అది రాష్ట్రమంతా విస్తరించారు. అక్కడి నుంచి రైతులకు కొనుగోళ్ల ఇబ్బందులు మారాయి. రెండేండ్లకే చాలా మార్పులు తీసుకువచ్చారు. అప్పట్లోనే రైతులకు కేవలం రెండు రోజుల్లోనే ధాన్యం డబ్బులు అందించారు. ఇది 2020 వానాకాలం కొనుగోళ్ల సీజన్​ వరకూ కొనసాగుతూ వస్తోంది.

ఇప్పుడు కష్టకాలమే

ఇప్పుడు రైతులకు కష్టకాలం మొదలుకానుంది. రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంతో మళ్లీ పాత రోజులు రానున్నాయి. కేంద్ర కొత్త చట్టాలు ఎలా ఉన్నా… రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్​పై భరోసా వేసి సాగు చేస్తున్న రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే సుదీర్ఘ కాలం కొనుగోళ్ల సమస్యలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అదే కథ ముందుకు రానుంది. ఎందుకంటే మద్దతు ధర ఎగిరిపోతోంది. కనీసం కష్టానికి తగ్గ ఫలితం కూడా వచ్చే పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలు ఇక నుంచి ఉండవంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన.. రైతులు, రైతు సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది. పంట ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగితే రైతులు పరిస్థిత ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్రేడర్లదే రాజ్యం

ప్రస్తుతం సర్కారు చాలా పకడ్భందీగా కొనుగోళ్లలో వ్యవహరిస్తున్నా కొన్నిచోట్ల ప్రైవేట్​ వ్యాపారుల బెడద తప్పడం లేదు. పంట పెట్టుబడులకు ఇబ్బందులు ఎదురై ప్రైవేట్​ అప్పులు తీసుకుంటే వాళ్లకు ఉత్పత్తులను అమ్మాల్సి వస్తోంది. దీంతో మద్దతు ధర దక్కడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పంట ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ నుంచి ప్రభుత్వం వైదొలిగితే రైతుల భవితవ్యం అంతా ట్రేడర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కనీస మద్దతు ధరకు ఎక్కడా చట్టబద్ధత లేకపోవటంతో వ్యాపారులు పాడిన పాటకే అమ్ముకోవాల్సి వస్తోంది. గతంలోనూ ఇలాంటి సంఘటనలే జరిగాయి. మద్దతు ధర రూ. 1200 ఉంటే… వ్యాపారులు కేవలం రూ. 700 నుంచి పాట మొదలుపెట్టేవారు. చివరకు అంతా సిండికేట్​గా మారి వారు చెప్పిన ధరకే ఉత్పత్తులు అమ్మాల్సిన పరిస్థితులను కల్పిస్తారు. ఎమ్మెస్పీ కంటే ఎక్కువ ధర వస్తే పరవాలేదు కానీ తక్కువ ఇస్తే ఏమిటనే ప్రశ్నకు రైతులకు సమాధానం దొరకటంలేదు. ఇప్పటి వరకు ప్రైవేట్​ ట్రేడర్లు రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చిన దాఖలాలు లేనేలేవు. ఈ నేపథ్యంలో వ్యాపారులకు మరింత వెసలుబాటు ఉంటున్న నేపథ్యంలో రైతులకు ధర ఎలా చెల్లిస్తారనేది అంతుచిక్కని ప్రశ్నే. దీంతో రైతులు మళ్లీ అప్పుల ఊబిలోకి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంటోంది.
ఒకవేళ ధర రాకుంటే తర్వాత అమ్ముకుందామనుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే రైతులు తమ పంట పొలాల నుంచి వాహనాల్లో మార్కెట్​ యార్డులకు తీసుకురావాలి. ఆ రవాణా ఛార్జీ ఉంటోంది. యార్డుల్లో ధర రాకుంటే మళ్లీ వెనక్కి తీసుకుపోవడం ఏ రైతు సాహసించడు. ఒకవేళ గోదాముల్లో దాచుకుందామనుకుంటే… ప్రభుత్వానికి సంబంధించిన ఉత్పత్తులే వాటిలో ఉంటాయి. సీజన్​ అయినా… అన్​సీజన్​ అయినా… ఒక్క గోదాం రాష్ట్రంలో ఖాళీ ఉండదు. అప్పటికే పంట పెట్టుబడికి అప్పు తెచ్చి ఉండటంతో రైతులు తక్కువైనా అమ్ముకుని తీరాల్సిందే. ఈ పరిస్థితిని అటు వ్యాపారులు… ఇటు ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగా ఉంటోంది.

చిల్లర కాంటాలతో దోపిడే

ప్రస్తుతం రాష్ట్రంలో 189 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, 94 సబ్‌ మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. గతంలో మాదిరిగానే వీటిలో పంట ఉత్పత్తుల కొనుగోలు చేస్తే మార్కెట్‌ ప్రాంగణంలో జరిగే క్రయవిక్రయాలపై ఒక శాతం సెస్‌ను వసూలు చేస్తారు. అంటే రూ. 1లక్ష విలువైన పంట ఉత్పత్తులను కొంటే, సెస్‌ రూపంలో రూ.1000 మార్కెటింగ్‌ శాఖకు వెళుతుంది. మార్కెట్​ యార్డుల్లో దళారుల సమస్యలు ఉన్నప్పటికీ.. లైసెన్సింగ్‌ విధానం, ప్రత్యేక మార్గదర్శకాలు ఉండటంతో ట్రేడర్ల వ్యవస్థ పూర్తిగా మార్కెటింగ్‌ శాఖ నియంత్రణలో ఉండేది. దీంతో ఎంతో కొంత భయంగానే వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం మార్కెట్​ యార్డుల వెలుపల జరిగే అమ్మకాలు, కొనుగోలుపై మార్కెటింగ్‌ శాఖకు నియంత్రణ ఉండదు. అంటే యార్డు గేటు దాటి బయట అమ్మినా… కొన్నా యార్డు పరిధికి రాదు. దీంతో ఆ చుట్టుపక్కల్నే ప్రైవేట్​ వ్యాపారులు కాంటాలు పెట్టుకుని కూర్చుంటారు. అసలే రైతుల కష్టాలు తెలిసిన వారు కావడంతో ట్రేడర్లకు మంచి వ్యాపారంగా కలిసి వస్తోంది. కొత్త చట్టంలో సెస్‌ వసూలు విధానం లేదు. దీంతో మార్కెట్​ యార్డుల ఆదాయానికి భారీగా గండి పడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను యథాతథంగా నిర్వహించాలని, గతంలో మాదిరిగానే సెస్‌ వసూలు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కానీ… మార్కెట్ల బయట జరిగే క్రయవిక్రయాలను ప్రభుత్వం పట్టించుకోదు.

కళ్లాలపై వాలనున్న వ్యాపారులు

ప్రస్తుతం ప్రైవేట్​ వ్యాపారులకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నట్లుగానే ఉంది. గతంలో ట్రేడ్​ లైసెన్స్​ల నిబంధన అయినా ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా ఉండదు. చేతిలో డబ్బులు ఉంటే ఎవరైనా ఈ వ్యాపారం చేయవచ్చు. దీంతో రైతుల ధాన్యం కళ్లాల్లోనే ఉండగానే గద్దలా వాలనున్నారు. కళ్లాల్లో ఎవో కథలు చెప్పి తక్కువ ధరకు కొనుక్కుని పోతారు. వాటిని ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తారు. ఇదంతా మళ్లీ వ్యాపార ముఠాను రంగంలోకి దింపడమే అవుతోంది. దీంతో నష్టమంతా మళ్లీ రైతుకే.
అటు ప్రైవేట్​ వ్యాపారుల కాంటాల్లో కూడా చాలా తేడాలుంటాయి. పలుమార్లు దొరికారు కూడా. తరుగు పేరుతో తీయడమే కాకుండా… ప్రతి 50 కిలోల బస్తాల్లో కాంటా రూపంలోనే రెండు, మూడు కిలోలు పోతుందని అంతా తెలిసిన విషయమే.

సాగుకు దూరం కావాల్సిందేనా..?

కేంద్ర చట్టాలపై ఎంత మేరకు అవగాహన ఉన్నా… లేకున్నా రాష్ట్ర రైతాంగానికి మాత్రం సీఎం కేసీఆర్​పైనే భరోసా. ఎందుకంటే వ్యవసాయ రంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తారనేది ముందు నుంచి ఉన్నమాట. రైతుబంధు ఇచ్చినా… లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను నిర్మిస్తున్నా రైతుల కోసమేనంటూ చెప్పుకుంటున్నారు. కానీ ఒక్కసారిగా సీఎం కేసీఆర్​ మాట మారింది. అసలే సీఎం కేసీఆర్​… ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఇక అంతే… మనసుకు వస్తే మల్లి… లేకుంటే ఎల్లి… అనే తెలంగాణ సామెత మాదిరిగా సీఎం తీసుకునే నిర్ణయాలపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు రైతుకు దిక్కెవరు… అనేదే రైతుల్లో నెలకొన్న అసలు ఆందోళన.

Advertisement

Next Story

Most Viewed