ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

by Shyam |
Plava nama Samvathsaram
X

దిశ, తెలంగాణ బ్యూరో : శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉగాదిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆకాంక్షించారు. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణమే ప్లవ నామ సంవత్సరం అని అన్నారు. మంగళవారం హైదరాబాద్ బొగ్గు కుంటలోని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. యాదగిరి లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన ప్లవనామ ఉగాది పంచాంగాన్ని ప్రభుత్వ సలహాదారు రమణాచారితో కలిసి మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ధన ధాన్యాలు కలుగుతాయని, వర్షాలు సమృద్దిగా కురుస్తాయని, శుభ ఫలితాలు కలుగుతాయని వివరించారు. సుఖ, సంతోషాలు కలుగుతాయని, ప్రభుత్వ రంగాలు, బ్యాంకింగ్ రంగం పురోగతిలో ఉంటాయని, విద్య సంస్థలకు వృద్ధి ఉంటుందని తెలిపారు.

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా సమష్టిగా పోరాడి, కరోనాపై విజయం సాదిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, రీజినల్ జాయింట్ కమిషనర్ క్రిష్ణవేణి కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement

Next Story