జాప్యం ఎందుకు.. నిర్మల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

by Aamani |
జాప్యం ఎందుకు.. నిర్మల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిర్మల్ జిల్లాలోని వివిధ చెరువుల్లో వెలసిన అక్రమ ఆక్రమణలను తొలగించడంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర హైకోర్టు వెంటనే వాటిపై దృష్టి సారించాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించింది. కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్ విచారణకు హాజరయ్యారు. చెరువులు, కాలువుల తదితర ప్రాంతాల్లో అక్రమంగా వెలసిన కట్టడాలను తొలగించాలని గతంలో ఆదేశించామని, ఆరు నెలలైనా ఇంకా ఎందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన కలెక్టర్ బదులిస్తూ, దాదాపు 80 శాతం మేర ఆక్రమణలను తొలగించామని, కానీ కరోనా తీవ్రత, ఇటీవల భైంసాలో జరిగిన అల్లర్ల కారణంగా మిగలిన 20 శాతం మేర ఆక్రమణల తొలగింపు ప్రక్రియ పూర్తి కాలేదని, రానున్న నెల రోజుల వ్యవధిలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఆ ప్రక్రియ జరిగే క్రమంలోనే మళ్ళీ ఆక్రమణలకు గురికాకుండా చెరువుల చుట్టూ కంచెలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రెండు నెలల్లోనే ఈ పనులు కూడా పూర్తవుతాయని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కబ్జాలకు గురి కాకుండా ఉండేలా లేక్ ప్రొటెక్షన్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. వరద కాలువల్లో ఆక్రమణలను తొలగించిన తర్వాత ఆ నీరు చెరువుల్లోకి వెళ్ళేలా లింకు కెనాల్‌లను కూడా నిర్మించాలని, నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం పనులకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను కోర్టుకు మర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించి తదుపరి విచారణను జూలై 29వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed