తక్షణమే ఆక్రమణలను గుర్తించండి

by Aamani |   ( Updated:2020-08-21 08:51:54.0  )
తక్షణమే ఆక్రమణలను గుర్తించండి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న చెరువుల కబ్జాలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. తక్షణమే చెరువుల ఆక్రమణలను తొలగించాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్, స్థానిక ఎస్పీ సహకారంతో క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని హైకోర్టు ఆదేశించింది. నిర్మల్ జిల్లా అదనపు మేజిస్ట్రేట్‌ను జిల్లా కేంద్రం సమీపంలోనే ఒక చెరువును స్వయంగా వెళ్లి పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే నిర్మల్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కె.అంజు కుమార్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా న్యాయవాది నరేష్ రెడ్డితో కలిసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రెవెన్యూ, శాఖల అధికారులు చెరువుల ఆక్రమణలపై ఇచ్చిన సమాధానంపై హైకోర్టు సంతృప్తి చెందలేదు. ఈ విషయంలో అధికార యంత్రాంగం నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వెంటనే నిర్మల్ జిల్లా రెవెన్యూ పురపాలక శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. చెరువుల శిఖం భూములతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని వక్ఫ్ భూములు, చెరువుల శిఖం భూములు, ప్రభుత్వ ఖాళీ ప్రదేశాలు ఆక్రమణకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మండలాలలోని ప్రభుత్వ కార్యాలయాలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాల హద్దులను గుర్తించి రికార్డులలో నమోదు చేయాలని సూచించారు. అలాగే అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని బాద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలన్నారు. ప్రతి మండల కార్యాలయంలో ఈ-ఆఫీస్ విధానం వందశాతం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీఏ, మీసేవా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed