పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యమే ప్రభుత్వ ల‌క్ష్యం

by Ramesh Goud |
Minister Errabelli Dayakar Rao
X

దిశ, జనగామ: పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందించాల‌న్న ల‌క్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సోమవారం జ‌న‌గామ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డ‌యాగ్నస్టిక్ సెంట‌ర్‌ను ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్ రాజయ్య లతో కలిసి మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి రక్త పరీక్షలు చేయించుకొని మాట్లాడారు.

సీఎం పేదల కోసం ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే ప్రతి జిల్లా కేంద్రంలో ఖరీదైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మకమైన మార్పులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన‌ట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకు రావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

21 వరంగల్, 27న జనగామకు సీఎం..

సీఎం కేసీఆర్ ఈనెల 21న వరంగల్‌కు రానున్నట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. సెంట్రల్ జైల్ స్థలంలో నిర్మించ తలపెట్టిన సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే ఈనెల 27న జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్న ట్లు మంత్రి తెలిపారు. ఈకార్య క్రమంలో జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, జిల్లా వైద్యా ధికారులు, వివిధ శాఖల అధికారులు,పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story