చుట్టాలబ్బాయిలాగా వ‌స్తాడు.. న‌గ‌ల‌తో ఉడాయిస్తాడు

by Web Desk |
చుట్టాలబ్బాయిలాగా వ‌స్తాడు.. న‌గ‌ల‌తో ఉడాయిస్తాడు
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: పెళ్లి శుభ‌కార్యాల‌కు వెళ్లి విలువైన ఆభ‌ర‌ణాల‌ను, వ‌స్తువుల‌ను దొంగిస్తున్న ఓ వ్యక్తిని స‌రూర్‌న‌గ‌ర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 17 తులాల బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు. శుక్రవారం రాచ‌కొండ సీపీ క్యాంపు కార్యాల‌యంలో ఎల్బీన‌గ‌ర్ జోన్ డీసీపీ స‌న్‌ప్రీత్‌సింగ్ మీడియా స‌మావేశంలో వివ‌రాలు వెల్లడించారు.




మ‌హ‌బూబున‌గ‌ర్ జిల్లా ఏనుకొండ మండ‌లం గొల్లగేరా గ్రామానికి చెందిన జాజ‌ల ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి అలియ‌స్‌ ర‌వితేజ అలియాస్‌ ల‌డ్డు (27) ఎల్బీన‌గ‌ర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల‌తో 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివి మ‌ధ్యలోనే చ‌దువు మానేసి త‌న బావ ద‌గ్గర జేసీబీ క్లీన‌ర్‌గా చేరాడు. జేసీబీ క్లీన‌ర్‌గా వ‌చ్చిన సంపాద‌న త‌న అవ‌స‌రాల‌కు స‌రిపోక‌పోవ‌డం, బావ స‌హాయం చేయ‌క‌పోవ‌డంతో సులువుగా డ‌బ్బు సంపాదించాల‌ని నిర్ణయించుకున్నాడు.




ఇందుకోసం ఫంక్షన్స్ హల్స్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నాడు. పెళ్లి శుభ‌కార్యాల‌లో బిజీగా ఉండ‌డంతో సులువుగా త‌న‌ప‌ని చేసుకోవ‌చ్చని దొంగ‌త‌నాల‌కు స్కెచ్ వేశాడు. న‌గ‌రానికి వ‌చ్చి ఎల్బీన‌గ‌ర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని త‌న ప్లాన్ ప్రకారం పెండ్లీ జ‌రిగే ఫంక్షన్స్ హల్స్‌ ఎంచుకునే వాడు. అంద‌రూ బీజీగా ఉండగా డ్రెస్సింగ్ రూమ్‌లోని బ్యాగుల్లో దొరికిన బంగారు ఆభ‌ర‌ణాల‌ను, న‌గ‌దును, విలువైన వ‌స్తువుల‌ను చోరీచేసి అక్కడి నుండి జారుకునేవాడు.

అయితే హ‌య‌త్‌న‌గ‌ర్‌, మీర్‌పేట్‌, స‌రూర్‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫంక్షన్స్ హల్స్‌‌లో జ‌రిగిన చోరీల‌పై ఫిర్యాదు అందాయి. దీంతో స‌రూర్‌న‌గ‌ర్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆదారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత‌డి వ‌ద్ద నుండి 17 తులాల బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై తొమ్మిది పీఎస్‌ల‌లో వివిధ ఇదే త‌ర‌హా కేసులు ఉన్నట్లు డీసీపీ స‌న్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఈ కేసులో వెంట‌నే ద‌ర్యాప్తు చేప‌ట్టి నిందితుడిని గుర్తించిన స‌రూర్‌న‌గ‌ర్ ఇన్‌స్పెట‌ర్ సీతారాం, ఇత‌ర పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. ఈ స‌మావేశంలో ఎల్బీన‌గ‌ర్‌ ఏసీపీ శ్రీ‌ధ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story