IIT Hyderabad లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం..

by Satheesh |   ( Updated:2022-07-04 11:11:12.0  )
Union Minister Jitendra Singh Inaugurates TiHAN Autonomous Navigation Testbed At IIT Hyderabad
X

దిశ, కంది: Union Minister Jitendra Singh Inaugurates TiHAN Autonomous Navigation Testbed At IIT Hyderabad| మనిషి అవసరం లేకుండానే వాహనాలు సరైన గమ్య స్థానాలకు చేరుకోవడం గొప్ప విషయమని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాదులో టీహాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగా తయారుచేసిన మానవ రహిత వాహనాల టెస్ట్ డ్రైవ్ పనితీరును ఆయన ప్రారంభించి అందులో ప్రయాణించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.


నాలుగో తరం ఇన్నోవేషన్లకు భారత్ వేదిక..

ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో తరం ఇన్నోవేషన్‌కు భారత్ పెద్ద వేదికగా మారిందని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇప్పటికే అటు వ్యవసాయ రంగంతో పాటు కొవిడ్ అనంతరం అత్యవసర సర్వీసుల్లో డ్రోన్లను ప్రత్యేకంగా వాడుతుండడం విశేషమని కొనియాడారు. నావిగేషన్ ఆధారంగా దాన్ని అనుసరిస్తూ ఎలాంటి డ్రైవర్ లేకుండానే వాహనాలు వాటి గమ్య స్థానాలకు చేరుకునేలా ఐఐటి హైదరాబాద్ పరిశోధన బృందం సభ్యులు కొత్త వాహనాలను తయారు చేయడం అభినందనీయమన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఐఐటి హైదరాబాద్ వేదికగా ప్యాసింజర్ డ్రోన్ల తయారీ ఏర్పాట్లు అవుతుండడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు.

రెండో తరం ఐఐటీల్లో ఐఐటి హైదరాబాద్ తన అశేషమైన కృషిని ముందుంచి సరికొత్త పరిశోధనలకు వేదికగా నిలవడం హర్షించదగ్గ విషయమన్నారు. మున్ముందు మరిన్ని నూతన పరిశోధనలు చేసి ముందుకు సాగాలని ఆయన అక్కడి విద్యార్థులకు సూచించారు. అంతకుముందు క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన డ్రోన్ల ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఐఐటి బోర్డ్ ఆఫ్ గవర్నర్ డాక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రెటరీ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బి.ఎస్.మూర్తి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed