బీర్లకు బదులు పెట్రోల్ బాంబ్స్ తయారుచేస్తున్న ఉక్రెయిన్ కంపెనీ

by Disha Desk |
బీర్లకు బదులు పెట్రోల్ బాంబ్స్ తయారుచేస్తున్న ఉక్రెయిన్ కంపెనీ
X

దిశ, ఫీచర్స్ : రష్యన్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్‌ బీర్ల కంపెనీ 'ప్రావ్దా' ముందుకొచ్చింది. ఈ మేరకు బీర్లకు బదులు 'మోలోటోవ్ కాక్‌టెయిల్‌' తయారుచేస్తోంది. అంతేకాదు ఈ కాక్‌టెయిల్‌ తయారీకి విరాళాలు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసింది. అయితే ఒక్క బీర్ల కంపెనీయే కాదు.. ఆక్రమణదారులను తటస్థీకరించేందుకు పౌరులు కూడా మోలోటోవ్ తయారుచేయాలని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ రెండు రోజుల కిందట ఓ పోస్ట్ షేర్ చేసింది.

ఇంతకీ మోలోటోవ్ కాక్‌టెయిల్ అంటే ఏమిటి?

పేదవాడి గ్రెనేడ్‌గా పిలిచే 'మోలోటోవ్ కాక్‌టెయిల్'‌ తయారీలో భాగంగా.. ఒక గాజు సీసాలో మండే ద్రవాన్ని(ఇథనాల్, తారు,గ్యాసోలిన్ మిశ్రమం) పోసి, అందులో ఓ గుడ్డను పెడతారు. పెట్రోల్, డీజిల్ వంటి మండే పదార్థాలను కలిగి ఉండే ఈ గ్లాస్ బాటిల్‌ను శత్రువుల మీదకు విసిరేస్తారు. ఇది 2.5 మీటర్ల వ్యాసార్థంలో ఎక్కువ మందికి నష్టాన్ని కలిగించగలదు. దీని తయారీకి 'ప్రావ్దా' ఒక ప్రత్యేకమైన బీర్ బాటిల్‌ను ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే చాలామంది ఉక్రెయిన్లు.. మోలోటోవ్ కాక్‌టెయిల్‌ను ఎలా తయారు చేయాలో గూగుల్‌లో శోధిస్తుండటం విశేషం.

'దేశాన్ని రక్షించాలనుకునే ఎవరికైనా మేము ఆయుధాలు ఇస్తాం. మా నగరాల్లోని కూడళ్లలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి' అంటూ ఉక్రెయిన్ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story