జంగంపల్లిలో టెన్షన్ టెన్షన్.. చేపల కోసం రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు

by Vinod kumar |
జంగంపల్లిలో టెన్షన్ టెన్షన్.. చేపల కోసం రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు
X

దిశ, భిక్కనూరు: చేపలు పట్టే విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం, చిలికి చిలికి గాలివానలా మారి.. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వు కోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. రాళ్లు రువ్వుకున్న ఘటనలో ఇరువర్గాలకు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడటం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని కుంటలో చేపలు పట్టడానికి మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో సభ్యులు కుంటలోకి దిగారు.


ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు, ఈ కుంటలో చేపలు పట్టడానికి మీకు హక్కు లేదని వారితో వాగ్వివాదానికి దిగారు. మత్స్య శాఖ అధికారుల అనుమతితోనే చేపలు పడుతున్నామని, ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, మత్స్యకారులు చెప్పగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగిపోయి ఒకరినొకరు తోసుకున్నారు. కుస్తీలు పట్టి కొట్టుకోవడం, రాళ్లతో దాడికి దిగడం మొదలుపెట్టడంతో కుంట వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇద్దరు పోలీసులను ముందుగా కుంట వద్దకు పంపించారు.


ఈ విషయాన్ని వెంటనే ఇక్కడ పోలీసులకు సమాచారం అందించడంతో భిక్కనూరు సీఐ తిరుపతయ్య, ఎస్ఐ ఆనంద్ గౌడ్, మరో ఎస్ఐ హైమద్ తమ సిబ్బందిని వెంటబెట్టుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల దాడిలో అంజయ్య, నీల స్వామి, మన్నెమ్మ, నవీన్ లు తీవ్రంగా గాయపడటంతో వారిని అంబులెన్స్ లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కొట్టుకుంటున్న ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడం, క్రమంగా పరిస్థితి అదుపు తప్పుతుండడంతో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు సుధాకర్, గుండ్ల రాజులకు సమాచారం అందించి వారిని కూడా పోలీసులు ఘటనా స్థలానికి రప్పించారు. ఇరువర్గాల వారిని మెప్పించి ఒప్పించి ఘర్షణకు దిగకుండా అడ్డుకున్నారు.


ఒక దశలో మహిళలు పోలీసులపై తిరగబడ్డారు. అయినప్పటికీ పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. కుంటలో చేపలు పట్టేందుకు మత్స్యశాఖ ప్రభుత్వం తరఫున అనుమతి నిచ్చిందని పోలీసులు ముదిరాజ్ సంఘం సభ్యులను నచ్చజెప్పి వారిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. నాలుగు సంవత్సరాలుగా రెండు కుంటలలో చేప పిల్లలను వదులుతున్నామని, చేపలు పట్టే హక్కు మాకే ఉందని ముదిరాజ్ సంఘం సభ్యులు పోలీసులతో గట్టిగా వాదనకు దిగారు. అయినప్పటికీ పోలీసులు వారిని సముదాయిస్తూ మత్స్యకారులు చేపలు పట్టడం పూర్తయ్యేదాకా, పోలీసులు వారికి రక్షణగా నిలిచారు.


చేపలు పట్టుకొని తిరిగి వెళ్తుండగా, పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం నెలకొనడంతో, కామారెడ్డి నుంచి అదనపు బలగాలను ఘటనా స్థలానికి రప్పించారు. మత్స్యకారులు కుంట దాటి వెళ్లే వరకు పోలీసులు వారికి రక్షణగా నిలిచారు. వారు వెళ్లిన కొద్దిసేపటి తర్వాత పోలీసుల వలయంలో ఉన్న ముదిరాజ్ సంఘం సభ్యులను కుంటలో నుంచి బయటకు పంపడం తో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు నాలుగు గంట పాటు కుంట వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడం గమనార్హం.

Advertisement

Next Story