కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్: రేవంత్ రెడ్డి

by Satheesh |
కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్: రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. 12 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టబోయే చివరి బడ్జెట్ అని, డిసెంబర్‌లో అసెంబ్లీ రద్దు అవుతుందని తెలిపారు. సభలో కాంగ్రెస్‌కు ఏమాత్రం అవమానం చేసిన.. రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగుతాయని హెచ్చరించారు. సభలో అవకాశం రాకపోతే.. వీధుల్లో పోరాడుదామని, అంతేగాకుండా ఎక్కడికక్కడ టీఆర్ఎస్‌ను అడ్డుకోవాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. గాంధీ భవన్‌లో ఆదివారం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది విద్యార్థులు, నిరుద్యోగులు‌, ఉద్యోగులు అని, రాష్ట్రం వచ్చిన తర్వాత వారిని పూర్తిగా కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. 1200 మంది తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతే.. వారి కుటుంబాలకు న్యాయం చేయలేదని ఆరోపించారు.


రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై జరుగుతున్న రేప్‌లలో టీఆర్ఎస్ నేతల హస్తం ఉంటుందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సుపారీ ఇచ్చారని చెబుతున్నారని, సుపారీ ఇచ్చింది కూడా టీఆర్ఎస్ నేతలే అని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల భూకబ్జాలు పెరిగిపోతున్నాయని, ధరణి లోపాల వల్ల హత్యలు జరుగుతున్నాయని, ఇవి కూడా శాంతి భద్రత వైఫల్యమే అన్నారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. విభజన బిల్లు ద్వారా రావాల్సిన రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటివి సాధించలేదన్నారు. పరిపాలనలో కలెక్టర్, ఎస్పీలుగా అర్హతలేని వారిని నియమించి కేసీఆర్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో బీహార్‌కు చెందిన అధికారులకే ఉన్నారని, ఐదు మంది బీహార్ అధికారులకు 40 శాఖలు ఉన్నాయన్నారు. సోమేశ్ కుమార్, అంజనీ కుమార్ ఏపీ క్యాడర్‌కు చెందిన వారిని ఇక్కడ పెట్టుకొని కీలక శాఖలు ఇచ్చాడని ధ్వజమెత్తారు. సోమేశ్ కుమార్ సర్వీస్ రికార్డు మీద రెండేళ్లుగా అడిగినా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ అక్రమాలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు.

గిరిజనులకు పోడు భూములను కుర్చీ వేసుకొని పట్టాలిస్తామని చెప్పిన కేసీఆర్ వారిని నిండా ముంచారన్నారు. మెట్రో విషయంలో గౌలిగూడ నుంచి ఫలక్ నుమా వరకు పూర్తి చేయకుండా నిధులు మెక్కేశారని ఆరోపించారు. కేటీఆర్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామన్నారు. కేటీఆర్ గతంలో ఫామ్ హౌస్ , డ్రగ్స్ విషయంలో సవాల్ విసిరి పారిపోయారన్నారు. కేటీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్న.. తెలంగాణ కంటే చత్తీస్‌గఢ్ మంచి పథకాలు అమలు చేస్తుందన్నారు. వరికి 1960 మద్దతు ధర ఉంటే చత్తీస్‌గఢ్ క్వింటాకు 2,500 ఇస్తున్నారని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం లేదని, చత్తీస్‌గఢ్‌లో ప్రతీ ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తుందని, దీని మీద చర్చకు మేం సిద్ధమని, ఆ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తామని.. అక్కడి ప్రభుత్వం ఎలా చేస్తుందో చేసి చూపిస్తామని వెల్లడించారు.


తెలంగాణలో వరి కుప్పలపై గుండె పగిలి చనిపోతున్నారని అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అంటున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం జరిగితే.. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే అవకాశం ఉండేదన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ద్వారా మోడీకి వ్యతిరేకం అని చెప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు 55 రోజులు, బడ్జెట్ సమావేశాలు 30 రోజులు జరిగేదని, కాని ఇప్పుడు ఎనిమిది రోజులకు కుదించారని ఆరోపించారు. ఈ సారి బడ్జెట్ సమావేశాలు కనీసం 21 జరిగేలా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని, రాచకొండ కమిషనర్ 2016 నుంచి అక్కడే ఉంటున్నారన్నారు. అధికారులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story