కేంద్రంపై టీఆర్ఎస్ మరో అస్త్రం.. అమీతుమీకి సిద్ధమైన కేసీఆర్

by GSrikanth |   ( Updated:2022-03-09 00:30:51.0  )
కేంద్రంపై టీఆర్ఎస్ మరో అస్త్రం.. అమీతుమీకి సిద్ధమైన కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అస్త్రాలనూ సిద్ధం చేసుకుంటున్నది. తాజాగా అసెంబ్లీని సైతం వేదికగా మార్చుకున్నది. బడ్జెట్ ప్రసంగంలోనే కేంద్రాన్ని శాపనార్ధాలు పెట్టింది. భవిష్యత్తులో తెలంగాణకు ఇవ్వాల్సిన గ్రాంట్లను ఇవ్వకుండా వివక్షతో వ్యవహరిస్తున్నదని నిందించడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌లో ఏకంగా రూ. 41 వేల కోట్లను గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వస్తున్నట్లు అంచనా వేసింది. ఇందులో రూ. 24,502 కోట్లు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు గతంలో నీతి ఆయోగ్ సిఫారసు చేసినవి.

నిజానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందించలేదు. 2015 మే నెలలో సిఫారసు చేసినా ఏడేళ్ళుగా సాకారం కాలేదు. అయినా తెలంగాణ ప్రభుత్వం దీన్ని బడ్జెట్‌లో పేర్కొన్నది. వస్తుందని నమ్మకం లేకపోయినా కేంద్రాన్ని నిందించడానికి, ఇరుకున పెట్టడానికి, రికార్డుపరంగా చూపించడానికి ముందస్తు ప్రణాళిక వేసుకున్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థే సిఫారసు చేసినందువల్ల ఇవ్వకపోవడానికి మోడీ ప్రభుత్వమే కారణమని ప్రజల్లో ప్రచారం చేసుకోడానికి అవకాశం కల్పించుకోవడమే బడ్జెట్‌లో ఆ అంచనాలు పెట్టుకోవడమనే వాదన వినిపిస్తున్నది.

గతేడాది అంచనాలు తారుమారు

గతేడాది బడ్జెట్‌లో సైతం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల ద్వారా రూ.38,669 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసింది. సవరించిన అంచనాల్లో రూ. 10 వేల కోట్లు తగ్గించి రూ. 28,669 కోట్లకు కుదించింది. 'కాగ్' ప్రొవిజనల్ డేటా ప్రకారం జనవరి చివరి నాటికి రూ.7,303 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 7వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి రూ. 28,669 కోట్లు వస్తాయని ఆశలు పెట్టుకున్నది. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో రూపొందించిన ఈ ఆశల ప్రకారం ఒక్క నెల వ్యవధిలోనే రూ. 21,366 కోట్లు దాదాపు వచ్చినట్లేననే అభిప్రాయాన్ని బడ్జెట్ ద్వారా వ్యక్తం చేసింది. మార్చి చివరి నాటికి ఎంత వస్తాయో రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి చివరి నాటికి కేవలం 19% అంచనాలు మాత్రమే వాస్తవరూపం దాల్చింది. అయినా వచ్చే ఏడాదిలో ఏకంగా రూ.41 వేల కోట్లు వస్తుందని భారీ అంచనా వేసింది. ఇందులో వెనకబడిన జిల్లాల అభివృద్ధికి వచ్చే రెండేళ్ళ పెండింగ్ నిధులు రూ. 900 కోట్లు, వచ్చే ఏడాదికి రావాల్సిన రూ. 450 కోట్లు కూడా ఉన్నాయి. ఇవి కాక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన రూ.9,443 కోట్లు, 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు హోంశాఖ నుంచి రావాల్సిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ రూ.3,003 కోట్లు కూడా ఉన్నాయి. జీఎస్టీ పరిహారంగా సుమారు రూ. 3,000 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో రాష్ట్ర సర్కార్ పేర్కొన్నది. కానీ, వసూళ్ళలో రాష్ట్రం పనితీరు సంతృప్తికరంగా ఉన్నందున పరిహారం అందే అవకాశం చాలా తక్కువ. అయినా ఆశలు పెట్టుకున్నది.

ఇన్ని రూపాల్లో చూస్తే రాష్ట్రం పెట్టుకున్న రూ.41 వేల కోట్ల అంచనాల్లో కచ్చితంగా వస్తాయనుకునేది రూ.13,796 కోట్లు మాత్రమే. మిగిలిన రూ. 27,206 కోట్లు గతేడాది లాగానే వసూలుకాని జాబితాలోనే చేరనున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు ఈ అంశంపై స్పష్టత ఉన్నప్పటికీ 'కేంద్రం నుంచి రావాల్సినవి' అనే లెక్కల్లో చూపించడం ద్వారా రికార్డుల్లోకి ఎక్కుతుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ అందకపోతే దానికి కేంద్ర ప్రభుత్వమే కారణమనే విమర్శ చేయడానికి టీఆర్ఎస్‌కు రాజకీయంగా అవకాశం లభిస్తుంది. గతేడాది బడ్జెట్‌లో గ్రాంట్లు, నాన్-టాక్స్ రెవెన్యూ అంచనాల్లో రూ. 20 వేల కోట్లు తేడా రావడంతో సవరించిన బడ్జెట్ అంచనాలనూ దానికి అనుగుణంగా తగ్గించుకోవాల్సి వచ్చింది.

ఈసారి మొత్తం బడ్జెట్ రూ. 2.56 లక్షల కోట్లుగా పెట్టుకున్నా అందులో కేంద్ర గ్రాంట్ల ద్వారా రూ. 41 వేల కోట్లు, అప్పుల ద్వారా రూ. 59,632 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా ద్వారా రూ. 18,394 కోట్లు వస్తాయని నమ్మకం పెట్టుకున్నది. మొత్తంగా రూ. 1.19 లక్షల కోట్లు రాష్ట్ర ఆదాయానికి సంబంధం లేకుండా సమకూర్చుకుంటున్నవే. నికరంగా రాష్ట్రం స్వంత పన్నుల ద్వారా, మైనింగ్ లాంటి వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నది రూ. 1.33 లక్షల కోట్లు. ఇందులో భూముల అమ్మకం ద్వారా రూ. 15,500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది కాక ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను కూడా అమ్మే ఆలోచన చేస్తున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.

బడ్జెట్‌లో పెట్టుకున్నట్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తే ప్రణాళిక ప్రకారం అవసరాలకు ఖర్చు చేసుకోడానికి ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి. రాకపోతే కేంద్రాన్ని కార్నర్ చేయడానికి రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతుంది. ఈ దృష్ట్యానే స్వంత వనరుల కంటే అప్పులు, కేంద్ర గ్రాంట్లపై ఎక్కువ ఆధారపడుతున్నట్లు బడ్జెట్‌ను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది.

Advertisement

Next Story

Most Viewed