భూ వివాదంతో వ్యక్తి బలవన్మరణం.. సూసైడ్ నోట్‌లో ఆ పెద్దమనుషుల పేర్లే ఉన్నాయా?

by Manoj |
భూ వివాదంతో వ్యక్తి బలవన్మరణం.. సూసైడ్ నోట్‌లో ఆ పెద్దమనుషుల పేర్లే ఉన్నాయా?
X

దిశ, తిరుమలాయపాలెం : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల పరిధిలో గురువారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన రావూరి చిన్న మల్సూరయ్య(75) బాలాజీ నగర్ తండా పంచాయతీ పరిధిలోని రమణ తండాలో గతంలో 8 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమి విషయంలో వివాదాలు జరుగుతున్నాయి.

ఈ భూ వివాదమై పోలీసులు, పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న మల్సూరయ్య, తెట్టెలపాడు & కేశ్వపురం క్రాస్ రోడ్డు, కాశిపట్నం సమీపాన ప్రైవేట్ వ్యవసాయ భూమిలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న స్టేషన్ ఎస్‌ఐ గిరిధర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ పడి ఉండడంతో ఎస్‌ఐ గిరిధర్ రెడ్డి ఆ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆ సూసైడ్ నోట్ లో ఏముంది..

మల్సూరయ్య మరణవార్త తెలుసుకుని కుటుంబ సభ్యులతో పాటు పిండిప్రోలు గ్రామస్థులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సూసైడ్ నోట్ లో ఏముందో చూపించాలని, సూసైడ్ నోట్ చూపించకుండా మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించవద్దని ఆ గ్రామానికి చెందిన పలువురు పోలీసులతో వాదించారు. శాంతిభద్రతల దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎస్‌ఐ గిరిధర్ రెడ్డి.. మృతుని కుమారునికి సూసైడ్ నోట్ చూపించి, బాడీని పోస్టుమార్టానికి తరలించారు.

కాగా భూ వివాదాన్ని పరిష్కరిస్తామని ముగ్గురు పెద్ద మనుషులు, చిన్న మల్సూరయ్య వద్ద నగదు ఒప్పందం కుదుర్చుకున్నట్లు, వారి పేర్లే సూసైడ్ నోట్ లో ఉన్నట్లు పిండిప్రోలు గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆ సూసైడ్ నోట్ ఓపెన్ చేసి చూస్తే వారి పేర్లు ఉన్నాయా, సూసైడ్ నోట్ మృతుడే రాశాడా లేక ఇంకేమైనా జరిగినా తెలిసేందుకు అవకాశం ఉన్నదని పలువురు చర్చించుకుంటున్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్ గురించే ఇప్పుడు అందరి చర్చ. అసలు విషయం తెలిసేందుకు అదే కీలక ఆధారం అనే విధంగా కూడా స్థానికులలో తీవ్ర చర్చ అంశమైంది. ఏది ఏమైనప్పటికీ పోలీసులు పెదవి విప్పే దాకా వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story