ప్రగతి భవన్‌లో 'శుభకృత్' వేడుకలు.. సీఎస్ సమీక్ష

by Vinod kumar |
ప్రగతి భవన్‌లో శుభకృత్ వేడుకలు.. సీఎస్ సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలనుకుంటున్నది. కరోనా కారణంగా రెండేళ్ళుగా ప్రభుత్వం అధికారికంగా ఉగాది పంచాంగ పఠనం కార్యక్రమాన్ని నిర్వహించినా పరిమితుల మధ్యనే చేయాల్సి వచ్చింది. ఈసారి మాత్రం ముఖ్యమంత్రి అధికారిక బంగళా ప్రగతి భవన్‌లో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులంతా హాజరుకావాల్సిందిగా సీఎంఓ వర్గాలు ఆహ్వానం పలికాయి.


వివిధ విభాగాల ముఖ్య అధికారులతో ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 2వ తేదీన ఉగాది (శుభకృత్ నామ సంవత్సరం) పండుగను పురస్కరించుకుని బాచుపల్లి కి చెందిన సంతోష్ కుమార్ శర్మ చేత పంచాంగ పఠనం జరిపిస్తున్నది.

శుభకృత్ నామ నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు సచివాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అధర్ సిన్హా, అరవింద్ కుమార్, నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, అదనపు డీజీ అనిల్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు ఈ సమావేశానికి హాజరై ఉగాది వేడుకల నిర్వహణపై చర్చించారు.


ప్రగతి భవన్‌లోని 'జనహిత'లో ఏప్రిల్ 2న ఉదయం 10.30 గంటలకు ఉగాది వేడుకలు ప్రారంభమవుతాయని సీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదపండితుల ఆశీర్వచనం ఉంటుందని, ఆ తర్వాత బాచుపల్లి సంతోష్ కుమార్ శర్మ పంచాంగ పఠనం చేస్తారని తెలిపారు.

వేద పండితులకు ఉగాది పురస్కారాలను స్వయంగా ముఖ్యమంత్రి అందజేస్తారని తెలిపారు. ఆ తర్వాత సీఎం సందేశం కూడా ఉంటుందని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు రవీంద్రభారతిలో కవి సమ్మేళనం జరుగుతుందని తెలిపారు. ఆయా విభాగాలు ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed