మార్కెట్లోకి వచ్చిన ఆరు నెలలకే కార్యకలాపాలను మూసేస్తున్న 'షాపీ'!

by Harish |
మార్కెట్లోకి వచ్చిన ఆరు నెలలకే కార్యకలాపాలను మూసేస్తున్న షాపీ!
X

బెంగళూరు: ప్రముఖ గ్లోబల్ కన్స్యూమర్ సంస్థ సీ లిమిటెడ్‌కు చెందిన ఈ-కామర్స్ విభాగం 'షాపీ' భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలే ఈ సంస్థ ఫ్రాన్స్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌లో కార్యకలాపాలను నిలిపేయడానికి ముందే సీ లిమిటెడ్ సంస్థ కొత్త విక్రేతలను తీసుకోవడాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయంతో షాపీ మార్కెట్ విలువ భారీగా క్షీణించింది. దాదాపు రూ. 1.3 లక్షల కోట్లకు పైగా నష్టాలను చూసింది. గతేడాది అక్టోబర్‌లోనే భారత్‌లోకి ప్రవేశించిన 'షాపీ' కంపెనీ కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మూసివేత నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

గత నెల కేంద్రం జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని సుమారు 53 యాప్‌లను నిషేధించింది. వీటిలో సీ లిమిటెడ్ సంస్థకు చెందిన గేమింగ్ 'ఫ్రీ ఫైర్' యాప్ కూడా ఉంది. దేశీయంగా ఈ యాప్‌కు మెరుగైన ఆదరణ ఉంది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగానే సీ లిమిటెడ్ షాపీని మూసేయాలని నిర్ణయించినట్టు మార్కెట్ వర్గాలు భావించాయి. కానీ, దీనిపై స్పందించిన షాపీ సంస్థ ఫ్రీ ఫైర్ రద్దుతో ఈ నిర్ణయానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అలాగే, స్థానిక విక్రేతలు, కొనుగోలుదారుల సంఘాలకు మద్దతిస్తూ, కార్యకలాపాల మూసివేత ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed