గురితప్పిన రష్యన్ మిసైళ్లు.. అమెరికా నిఘా అధికారుల వెల్లడి

by Harish |
గురితప్పిన రష్యన్ మిసైళ్లు.. అమెరికా నిఘా అధికారుల వెల్లడి
X

కీవ్: తమ సాయుధ బలగాల ప్రొఫెషనలిజం, మిస్సైల్ టెక్నాలజీ గొప్పతనం గురించి రష్యా రక్షణమంత్రి గత కొద్ది రోజులుగా గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అంత సీన్ లేదని అమెరికా నిఘా అధికారులు తోసిపుచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి పెద్దగా పుంజుకోకపోవడానికి ఆ దేశం ప్రయోగించిన క్షిపణులు చాలావరకు గురితప్పడమేనని వీరంటున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక దాడికి ఆదేశించారు. యుద్ధం మొదలై నాలుగు వారాలు పూర్తయినప్పటికీ ఉక్రెయిన్ వైమానిక బలగాన్ని తటస్థం చేయడం అనే ప్రాథమిక సైనిక లక్ష్యాన్ని సాధించడంలో కూడా రష్యా వైఫల్యం చెందడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తొలివారంలోనే 64 కిలోమీటర్ల పొడవైన సైనిక కాన్వాయ్‌ని ఉక్రెయిన్ గడ్డపై దింపిన రష్యా ఇప్పటికీ రాజధాని కీవ్‌ను వశపర్చుకోలేకపోవడానికి కారణం ఇదేనని అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారులు తేల్చి చెబుతున్నారు.

రష్యన్ క్షిపణుల వైఫల్యం నిజమేనా

సాధారణంగా గగనతలం నుంచి ప్రయోగించిన క్రూయిజ్ మిసైళ్ల ప్రామాణిక వైఫల్య రేటు ఎంత అనేది సామాన్యులకు తెలియకపోవచ్చు కానీ ప్రయోగించిన క్షిపణుల వైఫల్యం రేటు 20 శాతం లేదా అంతకు మించి ఉంటేనే దాన్ని అత్యధిక వైఫల్య రేటుగా లెక్కిస్తుంటామని ఇద్దరు యుద్ధ నిపుణులు అంతర్జాతీయ మీడియాకు చెప్పారు. అయితే తాము ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు 60 శాతం వరకు వైఫల్యం బారిన పడినట్లు అమెరికా నిఘా అధికారులు చెప్పడం పచ్చి అబద్ధాలేనని రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై రష్యన్ ప్రభుత్వ ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. రష్యా రక్షణ శాఖ సైతం ఈ అంశంపై ఫోన్ కాల్స్‌కి కూడా స్పందించలేదు. రాతపూర్వకంగా వ్యాఖ్య కోసం అభ్యర్థించినప్పటికీ స్పందించలేదు.

1,100 మిసైళ్లు ప్రయోగించినా ఫలితం లేదు

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైనప్పటినుంచి నేటివరకు 1,100 మిసైళ్లను రష్యా ప్రయోగించిందని అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అయితే వీటిలో ఎన్ని శత్రు లక్ష్యాలను ఛేదించాయి, ఎన్ని విఫలమయ్యాయి అనే విషయంపై పెంటగాన్ అధికారులు స్పష్టం చేయలేదు. అయితే అమెరికా నిఘా విభాగం అంచనా ఆధారంగా రష్యా క్షిపణుల వైఫల్యం రోజుకొక్క తీరుగా ఉంటోంది. ఏ రోజు ఏ రకం క్షిపణులను రష్యా ప్రయోగించింది అనే ప్రాతిపాదికన కొన్నిసార్లు రష్యా క్షిపణులు 50 శాతం వరకు గురి తప్పగా, కొన్నిసార్లు వైఫల్యాల రేటు 60 శాతం వరకు ఉంటోందని వీరు పేర్కొన్నారు. నిర్దిష్టంగా ఏ రోజు ఏయే క్షిపణులను పేల్చారనే అంశం ప్రాతిపదికన రష్యన్ క్షిపణులు 20 శాతం నుంచి 60 శాతం వరకు గురి తప్పి ఉంటాయని అమెరికన్ నిఘా అధికారులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed