ఆ కార్టూన్ సిరీస్‌ని బ్యాన్ చేసిన ర‌ష్యా! దాన్లో ఏముంది..?!

by Sumithra |   ( Updated:2023-05-05 07:43:29.0  )
ఆ కార్టూన్ సిరీస్‌ని బ్యాన్ చేసిన ర‌ష్యా! దాన్లో ఏముంది..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఒకవైపు ప్ర‌జాస్వామ్య జ‌పం చేస్తూనే, మ‌రోవైపు అధికారాన్ని ప్ర‌శ్నించ‌డం, వ్య‌తిరేకించ‌డం మాత్రం క్ష‌మించ‌రాని నేరంగా చూస్తుంది పాల‌క వ‌ర్గం. అందుకే, ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి వ్య‌తిరేకిస్తున్న త‌మ‌ పౌరుల్ని ర‌ష్యా ప్ర‌భుత్వం ఏమాత్రం స‌హించ‌ట్లేదు. ఇందులో భాగంగానే ఎప్ప‌టి నుంచో ఆన్‌లైన్‌లో న‌డుస్తున్న ఓ ర‌ష్య‌న్‌ యానిమేటెడ్ సిరీస్‌పై ఆంక్ష‌లు విధించింది. కొంటెగా, చమత్కారమైన సెటైర్లు వేస్తూ సాగే 'మస్యాన్యా' అనే కార్టూన్ సిరీస్ క్యారెక్ట‌ర్ ఇప్పుడు ర‌ష్య‌న్ ప్ర‌భుత్వానికి మింగుడు ప‌డ‌టంలేదు. ఇది రష్యన్ మాట్లాడేవారిలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కార్టూన్ యూట్యూబ్ ఛానెల్‌కు మిలియన్ కంటే ఎక్కువ మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు.

ఎప్ప‌టి నుంచో వ‌స్తున్న 'మస్యాన్యా' కార్టూన్ సిరీస్‌లో తాజాగా 'వాకిడ్జాసి' పేరుతో స‌రికొత్త ఎపిసోడ్ మార్చి 22న వ‌చ్చింది. ఈ ఎపిసోడ్ ఉక్రెయిన్ యుద్దంపై స్పందన‌గా తీసుకొచ్చారు. కార్టూన్ ఉద్దేశ‌మే సెటైర్ గ‌నుక అదే కోవ‌లో ర‌ష్య‌న్ ఫెడ‌రేష‌న్ సాయుధ ద‌ళాల‌ తీరును ప్ర‌శ్నించింది. ఎపిసోడ్‌లో, పాత్రలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చారు. రష్యన్ సైనిక బలగాలు బాంబులు వేసిన ఉక్రెయిన్ నగరాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను చూపిస్తూ కొన్ని వీడియోలు కార్టూన్‌లో ప్రదర్శించారు. ఎపిసోడ్ ముగింపులో, కార్టూన్ ప్రధాన పాత్ర మస్యాన్యా, పుతిన్ ద‌గ్గ‌ర‌కు వచ్చి ఒక జపనీస్ కత్తిని వదిలేస్తుంది. దానితో పుతిన్‌ ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ ఎపిసోడ్‌కు 24 గంటలలోపే 500,000 కంటే ఎక్కువ వ్యూవ్స్ వ‌చ్చాయి. ప‌లు ప్రశంసలు అందుకోగా, ర‌ష్యా స‌మ‌ర్థికుల నుండి బెదిరింపులు కూడా వ‌చ్చాయి. యూట్యూబ్‌లో ఎపిసోడ్ విడుద‌లైన వెంట‌నే, రష్యన్ ప్ర‌భుత్వ అధికారులు దానిని నిషేధించారు. అంతేగాక‌, ఎపిసోడ్‌ను ఆన్‌లైన్ నుంచి తొల‌గించ‌మ‌ని 'మస్యాన్యా' కార్టూన్ సృష్టికర్త ఒలేగ్ కువేవ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దాన్ని తొల‌గించ‌క‌పోతే, అత‌ని ఆన్‌లైన్ వేదిక‌ల‌న్నింటినీ బ్లాక్ చేస్తామ‌ని హెచ్చరించారు.

ఇక‌, మార్చి 5న, ర‌ష్యాలో ఓ కొత్త చ‌ట్టం ప్ర‌వేశ‌పెట్టారు. రష్యా సైన్యం గురించి "ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను పంపిణీ చేసే" వ్యక్తులకు 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించాలని పిలుపునిచ్చే ఈ కొత్త చట్టంపై పుతిన్ సంతకం చేశారు. దీని త‌ర్వాత, అనేక రష్యన్ మీడియా సంస్థలు ఇలాంటి భారీ ఆంక్షలను ఎదుర్కునే బదులు త‌మ కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణ‌యించుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed