ఆ పుస్తకాల జారీని ఉన్నతాధికారుల ఆదేశాలతో పక్కకు పెట్టిన రెవెన్యూ..!

by Mahesh |
ఆ పుస్తకాల జారీని ఉన్నతాధికారుల ఆదేశాలతో పక్కకు పెట్టిన రెవెన్యూ..!
X

దిశ, చౌటుప్పల్ : ప్రభుత్వం ఇచ్చిన భూములలో పేదలు ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో అసైన్డ్ కమిటీ వేసి వారికి పట్టా పాస్ పుస్తకాలు అందించడంతో ప్రభుత్వ పథకాలకు అర్హత కూడా సాధించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నూతన పట్టా పాస్ పుస్తకాలను జారీ చేయడంలో అధికారులు తాత్సారం చేయడంతో ఆ రైతులు రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఇదంతా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని 255 సర్వేనెంబర్ లోని అసైన్డ్ పట్టాదారు రైతుల ఆవేదన.

మండల కేంద్రంలోని 255 సర్వేనెంబర్ లో సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని గత ప్రభుత్వాల హయాంలో భూమి లేని నిరుపేదలకు పట్టా పాస్ పుస్తకాలు అందించారు. దీంతో రైతులు తమ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కాలం కలిసి వచ్చినా రాకున్నా పెట్టుబడి పెట్టి ఎన్నో ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు నూతన పాస్ పుస్తకాలు మంజూరు చేసింది. కానీ ఇక్కడి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడంలో అధికారులు తీవ్ర అలసత్వం వహించారు.

అధికారుల తప్పిదం తో రైతుల ఇక్కట్లు..

గతంలో 255 సర్వేనెంబర్ లోని 155 ఎకరాలకు అసైన్డ్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు పట్టా పాస్ పుస్తకాలను అందించారు. కానీ అప్పట్లో అక్కడ పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం అసైన్డ్ కమిటీలతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారికి ఇష్టారీతిగా పాస్ పుస్తకాలను అందించడం తోనే అసలు సమస్య తలెత్తినట్లు సమాచారం. ఈ సర్వే నెంబర్‌లో 155 ఎకరాల భూమి ఉండగా.. అధికారుల అవినీతి దాహంతో 155 ఎకరాలకు పైగా రైతులకు పాసు పుస్తకాలను పంపిణీ చేశారని, దీనిని సాకుగా చూపించి ప్రస్తుతం ఉన్న రెవెన్యూ అధికారులు కొత్త పాస్ పుస్తకాలను ఇవ్వడంలో జాప్యం చేస్తూ వస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రభుత్వ భూముల్లో 11 ఎకరాలను నారాయణపురం పిఎసిఎస్ కు అధికారులు కేటాయించడం కొసమెరుపు. సొసైటీకి కేటాయించడం లో అధికారులు చూపిన చిత్తశుద్ధి నిరుపేద రైతులకు కేటాయించడం లో చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

సమస్య పరిష్కారానికి చొరవ చూపని అధికారులు..

బాధిత రైతులు ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులు, కలెక్టర్ల చుట్టూ తిరిగిన సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపడం లేదని తెలుస్తుంది. రెవెన్యూ అధికారులు తలచుకుంటే రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించ గలరు కానీ కావాలనే అధికారులు సమస్యను పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇక్కడ సాగు చేసుకుంటున్న రైతులు అంతా నిరుపేదలు కావడంతో తమర్ని ప్రశ్నించేవారు ఎవరూ లేరనే ధీమాలో రెవెన్యూ అధికారులు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాసులు కురిపించే పనులను క్షణాలమీద చక్కపెడుతున్న రెవెన్యూ అధికారులు నిరుపేద రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ఒక గుంట భూమి కూడా లేదు : చిలువేరు నరసింహ, రైతు నారాయణపురం

255 సర్వేనెంబర్ లో తమకు ఎకరం భూమిని గతంలో లావుణి పట్టా ఇచ్చారు. దీంతో తాము కాయకష్టం చేసి ఇదే భూమిపై సాగు చేసుకుంటూ జీవనం సాగించాము. ఎక్కడ కూడా ఒక గుంట భూమిని తాము కొనుగోలు చేయలేదు. ఈ భూమిపై చేసిన కష్టం.. వేరే ఎక్కడ చేసిన రెండు ఎకరాల పైగా భూమిని కొనేవాళ్ళం. తీరా ఇప్పుడు ప్రభుత్వం నూతన పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంతో భూమిపై తమ హక్కులను కోల్పోతామనే భయం వేస్తుంది. కావున దయచేసి ప్రభుత్వం స్పందించి కొత్త పాస్ పుస్తకాలు ఇప్పించాలి.

రైతు బీమాను పొందలేక పోయాం : శ్రీశైలం,అసైన్డ్ రైతు కుమారుడు, నారాయణపురం

ఈ సర్వే నెంబర్ లో మా తాత నుండి వారసత్వంగా మా నాన్నకు 32 గుంటల భూమి వచ్చింది. మా నాన్న మరణించడంతో ఆ భూమిని మా అమ్మ పేరు పై చేయాల్సి ఉండగా.. కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంతో ఇటీవల మా అమ్మ మరణించిన రైతు బీమాను పొందలేక పోయాం. తమకు ఎక్కడ ఒక గుంట భూమి కూడా లేదని, ఏళ్లుగా భూమిపై ఆధారపడి బతికిన తమ తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయింది.

Advertisement

Next Story

Most Viewed