పోలీస్ స్టేషన్‌కు ఎక్కువ కేసులు రావద్దని పోలీసులు వింత పని

by Nagaya |   ( Updated:2022-03-08 15:07:44.0  )
పోలీస్ స్టేషన్‌కు ఎక్కువ కేసులు రావద్దని పోలీసులు వింత పని
X

దిశ, వెబ్‌డెస్క్ : మూఢ నమ్మకాలను నిర్మూలించాల్సిన పోలీసులు మూఢ భక్తిలో చిక్కారు. అవగాహన కల్పించాల్సిన వాళ్లే అజ్ఞానంలో మునిగిపోయారు. తమ పోలీస్ స్టేషన్‌కు అధికంగా కేసులు వస్తున్నాయని, స్టేషన్‌కు అరిష్టం పట్టిందని పోలీసులు ఏకంగా శాంతి పూజలు చేశారు. ఎస్ఐలు సైతం పాల్గొన్న ఈ పూజలు ప్రస్తుతం రాష్ట్రంలో వైరల్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఈ వింత పూజల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. అదే సమయంలో స్టేషన్‌లోనే ఓ కానిస్టేబుల్ పాముకాటుకు గురై తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. వీటికితోడు పొలిటికల్ కేసులు అధికంగా వస్తుండటంతో పోలీసులు ఒత్తిడికి గురయ్యారు. మరోవైపు నమోదవుతున్న కేసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి పెరిగింది. అయితే ఇవన్నీ తొలగిపోవాలంటే పోలీస్ స్టేషన్‌లో శాంతి పూజలు చేయించాలని కొందరు పోలీసులకు సూచించారు. వెంటనే రంగంలోకి దిగిన స్టేషన్‌ ఎస్ఐలు ఆదివారం శాంతి పూజలు చేయించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన శాంతి పూజల్లో స్టేషన్ సిబ్బంది అంతా పాల్గొన్నారు. ఎస్ఐల సమక్షంలో స్టేషన్‌లో, ఆవరణలో అర్చకులు వేదమంత్రాలు చదవుతూ గో మూత్రం చల్లారు. ప్రస్తుతం ఈ శాంతి పూజలు ఫొటోలు, వీడియోలు బయటకు పొక్కడంతో ఏపీలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed