ఆధార్ కార్డు, ఓటీపీ ద్వారా యూపీఐ సేవలు!

by Harish |
ఆధార్ కార్డు, ఓటీపీ ద్వారా యూపీఐ సేవలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌పీసీఐ) బ్యాంకులకు కీలక ఆదేశాలిచ్చింది. సాధారణంగా యూపీఐ చెల్లింపులకు డెబిట్ కార్డు తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మందికి డెబిట్ కార్డు సౌకర్యాలు లేవు. వాటి గురించి తెలియని వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌పీసీఐ డెబిట్ కార్డు లేని వారికోసం ఆధార్ నెంబర్, ఓటీపీ ద్వారా యూపీఐ సేవలను అందించేందుకు తగిన మార్పులను బ్యాంకులు ప్రవేశపెట్టాలని సూచించింది. ప్రస్తుతం యూపీఐ సేవలను పొందడానికి డెబిట్ కార్డుపై ఉండే చివరి ఆరు నంబర్లు తప్పనిసరి. ఓటీపీని ధృవీకరించిన తర్వాత యూపీఐ పిన్ నమోదు చేయాలి. ఇందులో మార్పులు చేసి ఆధార్ నంబర్‌తో చెల్లింపులు చేసేందుకు ఎన్‌పీసీఐ గతేడాదిలోనే సర్క్యులర్ ఇచ్చింది. 2021, డిసెంబర్ నాటికి కొత్త నిబంధనలు అమలు కావాల్సి ఉండగా, దీన్ని ఈ ఏడాది మార్చి 15కు పొడిగించారు.

గత కొన్నేళ్లలో దేశంలోని చాలామంది గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువ సంఖ్యలో జన్‌ధన్ అకౌంట్లను ప్రారంభించారు. వీరిలో కొందరికి డెబిట్ కార్డులు ఇచ్చినప్పటికీ చాలామంది వాటిని వాడలేదు. ఈ నేపథ్యంలోనే వారందరికీ యూపీఐ సేవలు లభించేలా ఎన్‌పీసీఐ కొత్త సౌకర్యాలను తెచ్చింది. ఆధార్, ఓటీపీ నుంచి యూపీఐ సేవలను పొందడానికి మొబైల్ నంబర్‌ను ఆధార్‌కు అనుసంధానం చేయాలి. అదే నంబర్‌ను కూడా బ్యాంకు అకౌంట్‌కు జత చేయడం తప్పనిసరి.

Advertisement

Next Story

Most Viewed