వనపర్తి సభ చరిత్రలో నిలిచేలా జయప్రదం చేయాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

by Manoj |
వనపర్తి సభ చరిత్రలో నిలిచేలా జయప్రదం చేయాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నెల 8న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ చరిత్రలో నిలిచేలా జయప్రదం చేయాలని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటల నుండి 11.30 మధ్యలో వనపర్తి జిల్లా కేంద్రానికి హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో రానున్నారని ఆయన తెలిపారు. మొదటగా చిట్యాల సమీపంలో నిర్మించిన మార్కెట్ యార్డును సీఎం ప్రారంభిస్తారన్నారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు - మన బడి రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, అనంతరం టీఆర్ఎస్ జిల్లా పార్టీ, సమీకృత కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని కర్నే ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, నూతన మెడికల్ కళాశాలకు ఒకే దగ్గర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి, శిలాఫలకాలు ఆవిష్కరిస్తారని మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు, ఈ సభకు జనసమీకరణను భారీ ఎత్తున నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభ జిల్లా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సభ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ సాయంత్రం 5:30గంటలకు హెలికాప్టర్ లో తిరిగి బయలుదేరుతారని మంత్రి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed