తెలంగాణపై కుట్ర జరుగుతోంది: కేంద్రంపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..

by Satheesh |
తెలంగాణపై కుట్ర జరుగుతోంది: కేంద్రంపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..
X

దిశ, సూర్యాపేట: రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కేంద్రానిదే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా రవాణా శాఖ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. రోజురోజుకి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరాకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 17000mw పైగా విద్యుత్ డిమాండ్ వచ్చినా.. సరఫరాకు సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్రం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.

తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిని కేంద్రం కక్ష్య పూరితంగా అడ్డుకుంటుందని పేర్కొన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థల నుండి వచ్చే రుణాలను తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు రాకుండా కేంద్రం మోకాలడ్డుతొందని తెలిపారు. ఇది తెలంగాణ ప్రజలకు కేంద్రం ద్రోహం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ.. తలసరి విద్యుత్ వినియోగంలో ముందుంటూ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా చూపాల్సిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు.

తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని ప్రజల్లో ఎండగడతామని, కేంద్ర వైఖరిని ఖండిస్తూనే రాష్ట్రానికి ఒప్పందం ప్రకారం రావాల్సిన ఋణాలపై చట్టప్రకారం పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్ వెంట నడుస్తున్న తెలంగాణ రైతుల ఉసురు తీసే కుట్రలు కేంద్రం చేస్తుందని.. ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఉన్నంతవరకు తెలంగాణ రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది రానీయడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు పాపం కేంద్రానిదేనని అడ్డగోలుగా ఇంధన, రవాణా ఛార్జీల పెంచడమే కాకుండా బొగ్గు దిగుమతులు, గ్రీన్ ఎనర్జీ సెస్ పేరుతో అధిక పన్నులు విధించడం వల్లే అనివార్య పరిస్థితుల్లో విద్యుత్ చార్జీల పెంపు జరిగిందని, కేంద్రం రాష్ట్రంపై చేస్తున్న కుట్రలు కుతంత్రాలను ప్రజల్లో ఎండగట్టి బీజేపీని నిలదీస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed