మాజీ నక్సల్ అరెస్ట్.. జనశక్తి పేరిట వసూళ్లకు యత్నం

by GSrikanth |
మాజీ నక్సల్ అరెస్ట్.. జనశక్తి పేరిట వసూళ్లకు యత్నం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: జనశక్తి పేరిట కార్యకలాపాలు కొనసాగిస్తూ చందాల దందాకు తెరలేపే ప్రయత్నానికి బ్రేకులు పడ్డాయి. సిరిసిల్ల జిల్లాలో జనశక్తి కీలక సమావేశం ఏర్పాటు చేసిందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. జనశక్తి కదలికలపై ఆరా తీస్తున్న క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలను మీడియాకు వెల్లడించారు. మాజీ నక్సల్స్‌తో చేతులు కలపి జనశక్తి సమావేశాలు జరిగాయని ప్రచారం చేసి అక్రమ వసూళ్లకు పాల్పడాలని నిర్ణయించుకున్నారని వివరించారు. మాజీ నక్సల్ గున్నాల లక్ష్మణ్, పోతుగళ్ సురేందర్ అలియాస్ సురేష్ అలియాస్ విశ్వనాథ్ మరికొంతమంది కలిసి ఈ పథకం వేశారన్నారు. వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను భయబ్రాంతులకు గురిచేసి అక్రమంగా చందాలు వసూళ్లు చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ ప్రచారం చేశారని ఎస్పీ తెలిపారు. బుధవారం సాయత్రం వేములవాడ శివార్లలో గున్నాల లక్ష్మణ్‌ను పట్టుకుని ఆరా తీయగా సింగల్ బోర్ తపంచ, ఏడు సెల్స్, ఒక మొబైల్, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

పదిహేను రోజుల క్రితం సురేందర్ అలియాస్ సురేష్ అలియాస్ విశ్వనాథ్, గున్నాల లక్ష్మణ్ మరో ముగ్గురు సహచరులు అయ్యోరుపల్లెకు చెందిన రాజ మల్లయ్యను బెదిరింపులకు గురి చేశారని రాహుల్ హెగ్డే వివరించారు. నంది కమన్ చౌరస్తా వద్ద అక్రమంగా రెండున్నర గుంటల భూమిని ఆక్రమించుకున్నాడని ఆ భూమి తమకు ఇవ్వాలని లేనట్టయితే అంతు చూస్తామని బెదిరించారన్నారు. భూమి ఇవ్వడానికి నిరాకరించిన రాజమల్లయ్యను చంపాలని పథకం వేసుకున్నారన్నారు. ఇందులో భాగంగా గున్నాల లక్ష్మణ్ ఒక సింగల్ బోర్ తపంచాతో మిగతా వారి కోసం ఎదురు చూస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. జిల్లాలో జనశక్తి నక్సల్స్ పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్సీ అన్నారు. ఏదైనా సమాచారం ఉన్నట్టైతే పోలీసులకు చేరవేయాలని కోరారు. జనశక్తి పేరిట ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రకాంత్, రవికుమార్‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story