ఎంపిక చేసిన ఉత్పత్తుల ధరలను పెంచిన నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్!

by Harish |
ఎంపిక చేసిన ఉత్పత్తుల ధరలను పెంచిన నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే వంటనూనె, పెట్రోల్ ధరల భారంతో కుదేలైన సామాన్యులకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరోసారి ధరలను పెంచినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజాలైన హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే కంపెనీలు పలు ఎంపిక చేసిన ఉత్పత్తుల ధరలు పెంచాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నెస్లే ఇండియా దేశవ్యాప్తంగా ఆదరణ కలిగిన తన మ్యాగీ ఉత్పత్తుల ధరలను పరిమాణాన్ని బట్టి 9-16 శాతం మేర ధరను పెంచేసింది. అలాగే, పాల ఉత్పత్తుల ధరను 4 శాతం, కాఫీ పౌడర్ 3-7 శాతం పెంచింది. మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ తన టీ, కాఫీ పౌడర్ ఉత్పత్తుల ధరలను 3 శాతం నుంచి 6 శాతం మధ్య పెంచేసింది. ధరల పెరుగుదల గురించి సంప్రదించగా నెస్లే ఇండియా స్పందించలేదని జాతీయ మీడియా పేర్కొంది.

ముడి పదార్థాల ధరల వ్యయంతో పాటు రవాణా ఖర్చులు, ఇతర కారణాలతో గత కొన్ని నెలలుగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు వివిధ విభాగాల్లో ఉన్న సరుకులు, పదార్థాల ధరలు పెంచుతూ వస్తున్నాయి. హిందుస్థాన్ యూనిలీవర్ ఇప్పటికే పలుమార్లు ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకోగా, నెస్లే ఇండియా ఈ ఏడాదిలో మొదటిసారి ధరల పెంపు నిర్ణయం తీసుకుందని మార్కెట్ వర్గాలు వివరించాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా గడిచిన ఆరు నెలల వ్యవధిలోనే సాధారణ వినియోగ వస్తువుల ధరలు సగటున 20 శాతానికి పైగా పెరిగాయని విశ్లేషకులు వెల్లడించారు.

Advertisement

Next Story