Kerala: దేశంలో సొంత ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రారంభించిన మొట్ట‌మొద‌టి రాష్ట్రం

by Sumithra |   ( Updated:2022-07-25 13:08:15.0  )
Kerala becomes First State in india to have its own Internet Service
X

దిశ‌, వెబ్‌డెస్క్ః Kerala becomes First State in india to have its own Internet Service| విద్య, ఆరోగ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థల‌కు పేరుగాంచిన కేరళ ఇప్పుడు ఇంటర్నెట్ సేవలను అందించడంలోనూ ఆదర్శంగా నిలవబోతోంది. కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ లిమిటెడ్ (KFON) తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుండి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్‌ను పొందింది. దీనితో ఈ రాష్ట్రం భారతదేశంలో తన స్వంత ఇంటర్నెట్ సేవను కలిగిన‌ మొదటి రాష్ట్రంగా నిలిచింది. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్వీట్ చేస్తూ, "దేశంలో కేరళ తన స్వంత ఇంటర్నెట్ సేవను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రంగా అవతరించింది. కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ లిమిటెడ్ (KFON) DoT నుండి ISP లైసెన్స్‌ను పొందింది. ఇప్పుడు, మా ప్రతిష్టాత్మక KFON ప్రాజెక్ట్ దాని కార్యకలాపాలను ప్రారంభించ‌బోతోంది. మా ప్రజలకు ఇంటర్నెట్‌ని ప్రాథమిక హక్కుగా అందిస్తున్నాము" అని అన్నారు.

ఈ అడుగుతో రాష్టంలో ఇంటర్నెట్ విద్య, బ్యాంకింగ్, ఇతర రంగాలకు మార్గాన్ని సులభతరం చేయడమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయాల్లో రద్దీని కూడా త‌గ్గించింది. 2 మిలియన్లకు పైగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలతో, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, పట్టణానికి ఉచిత ఇంటర్నెట్ సేవను అందించడమే KFON లక్ష్యంగా తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులను కనెక్ట్ చేయడం, వారి కనెక్టివిటీ అంతరాన్ని పెంచడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లతో భాగస్వాములను చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

వాస్తవానికి, 2019లోనే పినరయి విజయన్ ప్రభుత్వం 20 లక్షల పేద కుటుంబాలతో సహా ప్రభుత్వ కార్యాలయాలకు ఉచిత ఇంటర్నెట్ అందించాలనే ఉద్దేశ్యంతో ఇంటర్నెట్ కనెక్షన్‌ను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 10% ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే హైస్పీడ్ ఇంటర్నెట్ ఉండ‌గా, ఈ పథకం 30,000 ప్రభుత్వ కార్యాలయాలకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ని అందిస్తుంది. పాఠశాలలు, ఐటి పార్కులు, విమానాశ్రయాలు, ఓడరేవులకు ఉచిత ఇంటర్నెట్ అందించడంతో విద్య, రవాణా, నిర్వహణ, టూరిజం, ఐటి రంగాలు భారీ బూమ్‌ను చూడాలని భావిస్తున్నారు.

ఇక‌, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు సొంత ఇంటర్నెట్ కంపెనీ కూడా ఉండ‌గా, ఇది పెయిడ్‌ ఇంటర్నెట్ ప్యాకేజీలను అందిస్తుంది. అయితే, కేరళ మాత్రం సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచిత ఇంటర్నెట్ సేవలను అందజేస్తున్న‌ట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనిపిస్తుంది... నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story