మహిళా ఉద్యోగులకు కేసీఆర్ గిఫ్ట్

by Nagaya |
మహిళా ఉద్యోగులకు కేసీఆర్ గిఫ్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్థిక సాధికారతతో పాటు రాజకీయ సాధికారతను కట్టబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించి మహిళను సమున్నతంగా గౌరవించుకుంటుంన్నదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి 10 లక్షల మంది ఆడపిల్లల పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం చేసిందని గుర్తుచేశారు. 10 లక్షల మంది తల్లులకు 'కేసీఆర్ కిట్స్' అందించి ఆర్థికంగా ఆలంబన కల్పించిందన్నారు. 'ఆరోగ్యలక్ష్మి', 'అమ్మ ఒడి' లాంటి పథకాలను అమలు చేస్తున్నదన్నారు.

వితంతువులు, వృద్ధ మహిళలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు నెలా నెలా సకాలంలో పెన్షన్లు అందచేస్తూ, 'షీ టీమ్స్' ద్వారా రక్షణ కల్పిస్తున్నదన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు జీతాలను పెంచామని, అనేక పథకాలను వారి కోసం అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం 'మహిళా బంధు'గా ఆదరణ చూరగొంటున్నదన్నారు.

సమాజంలో పురుషుడితో పాటు అన్ని రంగాల్లోనూ మహిళలు సమాన పాత్ర పోషిస్తున్నారన్నారు. కుటుంబ అభివృద్ధిలో గృహిణిగా స్త్రీ పాత్ర గొప్పది, త్యాగపూరితమైనది కొనియాడారు. అన్నీ తానై కుటుంబాన్ని చక్కబెడుతూ ఆలనా పాలనా చూసే తల్లిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పాలనలోనూ వీటిని అన్వయించుకుంటున్నదని పేర్కొన్నారు. మానవ జాతికి మహిళ ఒక వరం అని వ్యాఖ్యానించారు. మహిళ అభ్యుదయానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదన్నారు.

Advertisement

Next Story

Most Viewed